08-04-2025 06:52:49 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు ఆర్థికంగా వారి కుటుంబాలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో వృత్తి శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు జి స్వరూప రాణి దేవేందర్ కోరారు. మండలంలోని ఆదిల్ పేట గ్రామంలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్ వృత్తి శిక్షణ తరగతులు ఈనెల ముగిస్తుండటంతో శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సింగరేణి యాజమాన్యం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు, యువతులకు, యువకులకు ఎన్నో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ సంవత్సరం ఏరియాలో మహిళలకు, యువతులకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, బ్యూటిషన్, కంప్యూటర్ కోర్సులు ప్రారంభించామన్నారు. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలని సింగరేణి సేవా సమితి ఎన్నో కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు తయారు చేసిన వాటిని విక్రయించడానికి హైదరాబాద్ శిల్పారామంలో, ప్రతి సంవత్సరం జరుగు నాంపల్లి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సభ్యులు కవిత, మణి, సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్ నెల్సన్, కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ నరేష్, శిక్షకురాలు రజిత, అభ్యర్థులు పాల్గొన్నారు.