25-02-2025 07:25:58 PM
టీజీబీ మేనేజర్ నరసింహ స్వామి...
మంచిర్యాల (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని, దేశాన్ని సమగ్ర అభివృద్ధి వైపు నడిపించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సీతారాంపల్లి శాఖ మేనేజర్ నరసింహ స్వామి అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు-2025లో భాగంగా మంగళవారం సాయంత్రం మహిళలకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలందరూ మొదటగా తమ కుటుంబాన్ని, తర్వాత గ్రామాన్ని, తద్వారా దేశ సౌభాగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం మహిళలకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాల నిర్వహణ గురించి తెలియజేశారు.
మహిళలు ముఖ్యంగా మూడు (గృహిణులు, వ్యాపారం చేసేవారు, ఉద్యోగస్తులు) రకాలుగా ఉంటారని, ఈ మూడు రకాలైన మహిళలు సంపాదనను, మిగులను బ్యాంకులలో పొదుపు చేసుకుంటే కుటుంబ అవసరాలకు పనికి వస్తుందన్నారు. బడ్జెట్ ను ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకోవాలని, తెలివిగా నడుచుకొని ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.