17-03-2025 01:42:55 AM
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అర్బన్, మార్చి 16 (విజయక్రాంతి): పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునిక కాలంలో అన్ని రంగాలలో మహిళలు రాణించాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక ఐడిఓసి లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుందని, వారి ప్రాధాన్యత నేటి సమాజానికి అవసరమని, వారిని ఆర్ధికంగా బలోపేతం చేసి సమాజంలో గౌరవాన్ని పెంపొందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మహిళల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వపరంగా అనేక రకమైన కార్యక్రమాలను చేపడుతున్నట్టు లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. మహిళల మెరుగైన జీవన ప్రమాణాల కోసం రు. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు,పది లక్షల వరకు ప్రమాద భీమతో పాటు వ్యాపారవేత్తలుగా మలిచేందుకు 100 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్లాంట్లను ఇండస్ట్రియల్ పార్కులో ఐదు శాతం, జిల్లాకు మహిళా పెట్రోల్ పంపులను ఇచ్చామన్నారు.ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలలో ఉన్న ప్రత్యేక ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ మహిళలు తన మేధస్సును ఉపయోగించి అన్ని రంగాలలో ముందుంటూ, అభివృద్ధిని సాధించాలన్నారు. కుటుంబ పరంగ, సమాజ పరంగా గౌరవం పొందుతూ, పిల్లలను భావితరాలకి ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో కృషిచేసిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్, సిడిపిఓ లు సూపర్వైజర్లు జిల్లా సాధికరిత విభాగం సిబ్బంది, ఐసిపిఎస్ సిబ్బంది, చైల్ హెల్ప్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.