04-03-2025 08:58:31 PM
మహిళలను గౌరవించే చోట దేవతలు ఉంటారు..
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు..
నాగోల్ లో మహిళా దినోత్సవ వేడుకలు..
ఎల్బీనగర్: అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారని, మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువైన ఉంటారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం నాగోల్ లోని పీబీఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల రాచకొండ పోలీసు మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరన్నారు.
తమ జీవితంలో ఎన్నోరకాల వివక్షను ఎదుర్కొంటూ, వారి ప్రతిభను ప్రదర్శిస్తూ అవరోధాలను అధిగమిస్తూ అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలు తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని దేశాభివృద్ధికి అందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలని, తమ కలల సాకారం కోసం అహర్నిశలూ పాటుపడాలని సూచించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ లో వందలాది మహిళలు సమర్థవంతంగా పని చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రిసెప్షన్, క్లరికల్ బాధ్యతలు మాత్రమే కాక ఎస్వోటీ, ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లో క్లిష్టమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
మహిళా అధికారులందరూ ధైర్యంగా ఉండాలని, తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ మహిళా సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ మల్కాజిగిరి పద్మజ, డీసీపీ యాదాద్రి రాజేశ్ చంద్ర, డీసీపీ ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ మహేశ్వరం సునీతా రెడ్డి, డీసీపీ రోడ్ సేఫ్టీ మనోహర్, ట్రాఫిక్ డీసీపీలు మల్లారెడ్డి, శ్రీనివాసులు, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రితో పాటు మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.