07-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): మీడియారంగంలో మహిళలను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. ఇప్పటికీ అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాయని, ఇప్పుడు మీ ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గురువారం జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల కష్టాలు తీర్చేందుకు, శ్రమ దోపిడికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని తెలిపారు. ప్రతీ ఇంట్లో ఆడవారి పట్ల గౌరవాన్ని పిల్లలకు నేర్పించాలని, పాఠశాలల్లో గురువులు బోధించాలని మంత్రి సూచించారు.
మీడియాలో మహిళలపై ఉన్న వివక్ష పోవాలని, రిపోర్టింగ్‌కు వెళ్లినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. మహిళా జర్నలిస్టుల వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ప్రజలకు న్యాయం జరిగేలా జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు. ప్రతి ఉద్యమం వెనుక జర్నలిస్టుల పాత్ర ఉందని, తెలంగాణ ఉద్యమంలో మీడియాది కీలకపాత్ర అని మంత్రి తెలిపారు. మీడియాలో పనిచేసే వాళ్లకు ఉద్యోగభద్రత ఉండాలన్నారు.