26-03-2025 05:56:45 PM
ఏరియా సేవా అధ్యక్షురాలు స్వరూపరాణి దేవేందర్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆర్థిక వృద్ధి సాధించాలని ఏరియా సేవ అధ్యక్షురాలు జి స్వరూపరాణి దేవేందర్ లు కోరారు. పట్టణంలోని సింగరేణి హై స్కూల్ ఆవరణలోని సేవ కేంద్రాన్ని బుదవారం ఆమె సందర్శించారు. సేవ సమితి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ సెంటర్ లను సందర్శించారు. అలాగే కంప్యూటర్ డిసిఏ కోర్స్ శిక్షణ ముగించుకున్న వారికి ఈ సందర్బంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... సింగరేణి యాజమాన్యం సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు, యువతీ, యువకులకు ఎన్నో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సంవత్సరం ఏరియాలో మహిళలకు, యువతులకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, బ్యూటిషన్, కంప్యూటర్ కోర్స్ లు ప్రారంభించడం జరిగిందన్నారు. వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకుంటున్న మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడి ఎంతో కొంత సంపాదించుకొని వారి కుటుంబాలకు అండగా నిలబడాలని ఆమె ఆకాంక్షించారు. సేవా సమితి మహిళలు తయారు చేసిన వస్తువులు విక్రయించేందుకు హైదరాబాదులోని శిల్పారామంలో, ప్రతి సంవత్సరం జరుగు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో స్టాల్స్ నిర్వహిస్తున్నారని, మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సభ్యులు కవిత, మనీ, శిక్షకురాలు, అభ్యర్థులు పాల్గొన్నారు.