calender_icon.png 27 April, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ఉత్పత్తులకు భారత్ సమ్మిట్‌లో విశేష ఆదరణ

26-04-2025 08:45:50 PM

కలెక్టర్ ఆలోచనతో శిల్పారామంలో ప్రత్యేకమైన ప్రదర్శన స్టాల్‌లు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి.పాటిల్(District Collector Sri Jitesh V. Patil) ఆదేశానుసారం, 2025 ఏప్రిల్ 26న హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో  జిల్లా మహిళల ఉత్పత్తులకు ప్రత్యేకంగా స్టాల్‌లు ఏర్పాటు చేశారు. గతంలో కలెక్టర్ ఆలోచన మేరకు, మార్చి 9న హైదరాబాద్ మాదాపూర్‌లోని నాలెడ్జి సిటీలో నిర్వహించిన "రన్ ఫర్ హర్" కార్యక్రమంలో కూడా జిల్లా మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించి విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ అనుభవంతో మరింత ప్రేరణ పొందిన మహిళలు, ఇప్పుడు భారత్ సమ్మిట్‌లో మరింత విస్తృత స్థాయిలో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. 

ఈ కార్యక్రమానికి DRDA నుండి మహిళా సమాఖ్యలకు చెందిన మహిళలు హాజరై, ఇల్లందు పిండివంటల ప్రదర్శన చేశారు. అదేవిధంగా వెదురు, సిమెంట్‌తో తయారు చేసిన సంప్రదాయ గదలు, కోయ కల్చరల్ ఆర్ట్స్ అండ్ వుడ్ క్రాఫ్ట్స్ (జిసీసీ), ఐటీడీఏ వారు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు కూడా ఈ స్టాల్‌లో ప్రదర్శించబడ్డాయి. కలెక్టర్ సొంత ఆలోచన మేరకు, వ్యాయామానికి ఉపయోగించే విధంగా వెదురు, సిమెంట్ మిశ్రమంతో రూపొందించిన ప్రత్యేకమైన గదలు ఏర్పాటుచేయడం జరిగింది. ఈ వినూత్న రూపకల్పన సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌లకు మంచి స్పందన లభించినట్లు డీఆర్డిఏ, డీపీఎం నాగజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్పత్తుల ప్రదర్శన ద్వారా భద్రాద్రి కొత్తగూడెం ప్రతిష్టను మరింత పెంచారు.