calender_icon.png 12 January, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతివల రక్షణలో ‘మహిళా శక్తి’

12-01-2025 12:48:49 AM

రైల్వేలో కీలకంగా ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది నియామకం

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): రైల్వేలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా ఆర్‌పీఎఫ్ ద్వారా మహిళా సిబ్బందిని భారీగా నియమించింది. వీరు 24 గంటల పాటు రైల్వే స్టేషన్లు, రైళ్లలో మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటారు.

ఆపరేషన్ మేరీ సహేలి, ఆపరేషన్ మాతృశక్తి, ఆపరేషన్ డిగ్నిటీ, మిషన్ జీవన్ రక్ష, ఆపరేషన్ ఆహత్ తదితర కార్యక్రమాల ద్వారా మహిళలు, చిన్నారులకు రైల్వేలో భద్రమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విమెన్ వింగ్ కృషి చేస్తోందని దక్షిణ మధ్య రైల్వే ఐజీ అరోమాసింగ్ తెలిపారు. 

ఆపరేషన్ సహేలీ ద్వారా 249 ప్రత్యేక మహిళా పోలీసు బృందాలు దేశవ్యాప్తంగా 500కు పైగా రైళ్లలో మహిళలు, చిన్నారుల భద్రతపై దృష్టి పెడ్తున్నాయి. నిత్యం సుమారు 13వేల మందికి పైగా మహిళా ప్రయాణికుల ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు సంరక్షిస్తూ వారి సురక్షిత ప్రయాణానికి సాయపడుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వే లో శక్తిబృందాలు ప్లాట్‌ఫాంల మీద పెట్రోలింగ్ చేస్తున్నాయి. ఆపరేషన్ మాతృశక్తి పేరిట మహిళా కానిస్టేబుళ్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని ప్రయాణికులే అంటున్నారు. 2024లో 174 ప్రసవాల్లో మహిళా ఆర్పీ ఎఫ్ కానిస్టేబుళ్లు సాయమందించారు. మిషన్ జీవన్ రక్ష పేరిట 1043 మంది మహిళలు, బాలికలను మృత్యువు కోరల్లోంచి కాపాడారు.