calender_icon.png 7 March, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్‌లో మహిళలది కీలక పాత్ర

07-03-2025 12:09:00 AM

  1. ముద్ర రుణాల్లో మహిళలకే 70 శాతం రుణాలు
  2. కోటి మంది అతివలను లక్షాధికారులను చేశాం
  3. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి
  4. హైదరాబాద్‌లో మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే
  5. మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): వికసిత భారత్ దిశగా దేశం దూసుకుపోతున్నదని, దీనిలో మహిళలదే కీలక పాత్ర అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌లో గురువారం మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కతో కలిసి విచ్చేసి మాట్లాడారు.

పదేళ్ల బీజేపీ పాలనలో స్వయం సహాయక సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించాయని కొనియాడారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన సాధికారతకు కోట్లాది రూపాయలు ఆర్థిక సాయం అందించామన్నారు. ముద్ర యోజన ద్వారా మొత్తం రుణాల్లో 70 శాతం మేర మహిళలకే అందజేశామని స్పష్టం చేశారు. తద్వారా కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని, ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కొనియాడారు.

సింగరేణిలో మహిళల రిక్రూట్‌మెంట్‌కూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏ రంగంలోనైనా మహిళల భాగస్వామ్యం పెరిగితే ఉత్పత్తి సామర్థ్యం సైతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మైనింగ్ రంగంలో పనిచేసే వారికి కేంద్రం రూ.కోటి మేర ఆరోగ్య, జీవిత బీమా ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.

మహిళల గౌరవాన్ని పెంచేందుకు కేంద్రం స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా 11 కోట్ల టాయిలెట్లు నిర్మించిందన్నారు. ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాల వరకు పెంచామని గుర్తుచేశారు. ఉన్నత విద్యలో మహిళల అడ్మిషన్లు 28 శాతానికి పైగా పెంచేందుకు కృషి చేశామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించామని, తద్వారా మహిళలు బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే కష్టం తప్పినట్లు వెల్లడించారు. ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించామని వివరించారు.

మహిళా సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించాలి: మంత్రి సీతక్క

 కేంద్ర బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి ఎక్కువ నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. దేశంలోని మైనింగ్ రంగంలో మహిళల భాగస్వామ్యం 10శాతం లోపు ఉందని, అందుకే ఆ రంగంలో వారి భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళలకు పనికి తగిన వేతనం అందేలా చూడాలన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని కొనియాడారు.  సమాజ కట్టుబాట్ల కారణంగా మహిళలు ముందడుగు వేయలేక  వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు.