calender_icon.png 5 February, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలి

05-02-2025 06:47:32 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లా మత్స్య శాఖ ద్వారా రాయితీతో మంజూరైన చేపల సంచార వాహనాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ పథకంలో క్యాంటీన్లు, మీ సేవ, పెరటి కోళ్ల పెంపకం, కోళ్ల ఫారం, డైరీ ఇతర అనేక అంశాలను పొందుపరిచి అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో కాగజ్ నగర్ మండలంలోని మహిళా స్వయం సహాయక సభ్యురాలు స్వరూపకు మహిళా శక్తి పథకం కింద మంజూరైన వాహనం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందాలని తెలిపారు. మహిళ సభ్యురాలు 4 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కింద నగదు చెల్లిస్తే ప్రభుత్వం 6 లక్షల రూపాయల రాయితీతో 10 లక్షల రూపాయల విలువ గల వాహనాన్ని మంజూరు చేసిందని తెలిపారు. ఈ వాహనం ద్వారా వివిధ ప్రాంతాలలో చేపలను విక్రయించడం ద్వారా వ్యాపారాన్ని కొనసాగించి ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, సెర్ప్ సిబ్బంది, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.