- త్వరలో పల్లెల్లో ‘మీసేవ’ కేంద్రాల ఏర్పాటు
- మహిళాశక్తి పథకం కింద అందుబాటులోకి ఆన్‌లైన్ సేవలు
- మహిళా సంఘాలకు బాధ్యతలు
- నెలరోజులపాటు ప్రత్యేక శిక్షణ
- ఆసిఫాబాద్ జిల్లాలో తొలివిడతతో 78 గ్రామాలకు మంజూరు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ప్రస్తుతం.. దరఖాస్తు ప్రక్రియ మొదలు ప్రతీది ఆన్‌లైన్ సేవలతో ముడిపడి ఉండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారింది. దీంతో ప్రతి పల్లెలో మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా శక్తి పథకం కింద గ్రామాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మీసేవా కేంద్రాల బాధ్యతలను మహిళ సంఘాలకు అప్పగించనున్నారు. మీసేవ కేం ద్రాల ఏర్పాటుకు దరఖాస్తుదారులు ఇంటర్ అర్హత కలిగిఉండాలని అధికారులు తెలిపారు.
పూర్తయిన ఎంపిక
ఆసిఫాబా జిల్లాలో 78 గ్రామాలకు మీసేవ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మహిళలు ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా మీసేవ కేంద్రాలను వారికి అప్పగించనున్నారు. ఇప్పటికే జిల్లాలో మహిళ సంఘాలను.. మిల్లెట్ ప్రాసెసింగ్ సెంటర్లు, తెనే తయారీ కేంద్రం, మొక్కల పెంపకం, కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, జిల్లా కేంద్రంలో సినిమా థియేటర్ల ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డీఆర్‌డీఏ, సెర్ఫ్ శాఖల అధ్వర్యంలో పలు పథకాలను అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి మీసేవ కేంద్రాలు మంజూరు చేయనుండటంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలను జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. జనాభా ప్రాతిపదికన మీసేవ కేంద్రాలను నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ) వారు ఎంపిక చేశారు. ప్రస్తుతం మెజార్టీ మీసేవ కేంద్రాలు మండల కేంద్రాల్లోనే ఉండటంతో గ్రామీణా ప్రాంత ప్రజలు, విద్యార్థులు.. వారికి అవసరమైన సేవల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆర్థికంగా, దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు.
నెలరోజులపాటు శిక్షణ
మీసేవ కేంద్రం మంజూరైన గ్రామంలో కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన మహిళా సంఘంలోని ఇంటర్ చదివిన సభ్యురాలికి మీసేవ కేంద్రం బాధ్యతను అప్పగించ నున్నారు. మందుగా.. కేంద్రం నిర్వహణ, సేవలపై నెలరోజలు పాటు శిక్షణ అందించను న్నారు. అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీసేవ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది. మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్థేశించిన రుసుం మేరకు పారదర్శకమైన సేవలందించనున్నారు. మీ సేవ అధికారుల ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాలను పర్యవేక్షిస్తుంటారు.
పల్లె ప్రజలకు అందుబాటులోకి...
స్థానికంగా మీ సేవ కేంద్రాలు లేకపోవడంతో గ్రామాల్లోని ప్రజలు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ సేవలు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఈ మీ సేవ కేంద్రాలు మంజూరైన గ్రామల్లోని.. గ్రామ పంచాయతీ భవనం, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు, ప్రభుత్వ భవనాల్లోని అనువైన చోట ఏర్పాటు చేయనున్నారు.
తొలివిడత 78 గ్రామాలకు మంజూరు
తొలివిడతగా ఆసిఫాబాద్ జిల్లాలోని 78 గ్రామాలకు మీసేవ కేంద్రాలు మంజూరు చేశారు. మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులు వీటిని నడపనున్నారు. జిల్లాలోని.. ఆసిఫాబాద్ మండలంలో మోతుగూడ, బాబాపూర్, అంకుశాపూర్, గుండి, ఎల్లారం, బురుగూడ, ఆడ, చిర్రకుంట, ఈదులావాడ, బెజ్జుర్ మండలంలో.. ఔటసారంగిపల్లె, కుకుడ, రెబ్బెన, బెజ్జుర్, ముంజంపల్లి, దహెగాం మండలంలో.. అజ్నాం, దహెగాం, భీబ్రజైనూర్ మండలంలో.. పొచ్చంలొద్ది, గుడంబాడ, దబోలి, జామ్‌గాం, జైనూర్, మార్లవాయి, కాగజ్‌నగర్ మండలంలో.. మోసం, రాంనగర్(ఎన్), సంత్‌నగర్, గన్నరం, నాగంపేట్, బోగపల్లి, చింతగూడ, వంజీరి, దుర్గ్గానగర్.
కెరమెరి మండలంలో.. ధనోర, గోయాగాం, కెరమెరి, సాగ్వీ. కౌటాల మండలంలో.. తాటిపల్లి, మోగడ్‌దగడ్, కౌటాల, గురుడపేట్, గుడ్లబోరి, తాలొడి. రెబ్బెన మండలంలో.. కైర్‌గాం, కొండపల్లి, తక్కల్లపల్లి, వంకులం, రెబ్బెన, నారాయణపూర్. సిర్పూర్(టి) మండలంలో.. వెంపల్లి, చింతకుంట, నవేగాం . సిర్పూర్(యు) మండలంలో.. పంగిడి, నెట్నూర్, సిర్పూర్(యు). తిర్యాణి మండలంలో.. పండిగి మాదర, తిర్యాణి, రొంపల్లి, గిన్నెధరి.
వాంకిడి మండలంలో బంబార, వాంకిడి కలన్, బెండర, ఇందాని, జైత్‌పూర్, ఖమాన, గోయగాం. లింగాపూర్ మండలంలో.. మాడిమి పల్లి, లొద్దిగూడ, చోర్‌పల్లి, లింగపూర్. పెంచికల్‌పేట్ మండలంలో.. కొండపల్లి, ఎల్లూర్, కమ్రెగాం. చింతలమానేపల్లి మండలంలో.. బాలాజీ అనకొడ, రవిందరనగర్ బాబాసాగర్, గూడెం, కరంజీవాడ గ్రామాల్లో మీ సేవ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
మహిళా శక్తి పథ కం కింద మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం మ హిళా సంఘాలకు మీసేవ కేంద్రాల బాధ్యతను అప్పగించనుంది. జిల్లాలో 78 కేంద్రాలు ఏర్పా టు చేయనున్నాం. ఇప్పటికే సం ఘాలు ముందుకు రావడంతో ఎంపిక ప్రక్రి య పూర్తి చేశాం. మీ సేవ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
సురేందర్, డీఆర్‌డీఓ, ఆసిఫాబాద్