calender_icon.png 24 November, 2024 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోరెన్‌కు మద్దతుగా మహిళలు

24-11-2024 01:18:55 AM

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు జేఎంఎం కూటమికే దక్కింది. సోరెన్ ప్రభుత్వం మైయా సమ్మాన్ యోజన పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. వెయ్యి అందిస్తోంది. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే ఈ పథకం ద్వారా మహిళలకు అందించే నగదును రూ.2,500లకు పెంచనున్నట్టు సోరెన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

దీంతో మహిళలు ప్రభావితమయ్యారు. దీనికి తోడు హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకున్నారు. 

కలిసొచ్చిన సానుభూతి

అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది ముంగిట మనీలాండరింగ్ కేసులో ఈడీ హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసింది. బీజేపీ దీన్ని అస్త్రంగా మలుచుకుని సోరెన్ అవినీతికి పాల్పడ్డారంటూ ప్రచారంలో పదే పదే ఆరోపించింది. అయితే సోరెన్ మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. గిరిజన సీఎం అయినందువల్లే తనను బీజేపీ అక్రమ కేసుల్లో ఇరికించిందంటూ ఎదురు దాడి చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వ్యతిరేకి అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో ప్రజలు జేఎంఎం కూటమి వైపు మొగ్గు చూపారు. 

బీజేపీని ఇరుకున పెట్టిన సోరెన్

బీజేపీ నేతలు దాదాపు ప్రతి ర్యాలీలో చొరబాటుదారుల అంశాన్ని ప్రస్తావించారు. హేమంత్ ప్రభుత్వం అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం వల్ల రాష్ట్ర పౌరులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అయితే వీటిని హేమంత్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. సరిహద్దు నుంచి చొరబాటు దారులు దేశంలోకి ప్రవేశిస్తూ ఉంటే బీఎస్‌ఎఫ్, కేంద్ర హోం శాఖ ఏం చేస్తోందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హేమంత్ లేవనెత్తిన ప్రశ్నకు బీజేపీ సరైన సమాధానం చెప్పలేకపోయింది. 

ఫలించని చంపయి సోరెన్ అస్త్రం

ఎన్నికల ముందు చంపయి సోరెన్ పార్టీని వీడి బీజేపీలో చేరడం ద్వారా జేఎంఎంలో చీలికలు వస్తాయని కాషాయ నేతలు భావించారు. అలా జరిగితే ఎన్నికల్లో సునాయాసంగా గెలువొచ్చని భావించింది. పార్టీలో చీలికలు రాకుండా హేమంత్ సరైన చర్యలు తీసుకున్నారు. దీంతో బీజేపీ అనుకున్నట్టుగా చంపయి అస్త్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

మిత్రపక్షాల కృషి

ఇండియా కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టాయి. కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే ఆర్జేడీ ఆరు స్థానాల్లో పోటీ చేసి నాలగు స్థానాల్లో గెలుపొందగా సీపీఐ(ఎంఎల్) 4 స్థానాల్లో బరిలో నిలిచి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల్లో స్వతహాగా 34 సీట్లలో గెలుపొందిన జేఎంఎం మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. 

బీజేపీ చేసిన పొరపాటు ఇదే?

జార్ఖండ్‌లో ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఆదివాసీ బిడ్డే సీఎంగా ఉండాలని అక్కడి ప్రజలు బలంగా కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ నేతను సీఎంను చేస్తామనే హామీ బీజేపీ నుంచి రాకపోవడం ఆ పార్టీ చేసిన పెద్ద పొరపాటుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత సీఎంను ప్రకటించే సంప్రదాయాన్ని జార్ఖండ్‌లో కూడా అమలు చేసినందువల్లే బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

తాజాగా జేఎంఎంను వీడి  బీజేపీ తీర్థం పుచ్చుకున్న చంపయి సోరెన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ, మాజీ కేంద్ర మంత్రి అర్జున్ ముండా వంటి గిరిజన నేతల్లో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఫలితాలు ఏకపక్షంగా ఉండేవి కాదేమోనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.