calender_icon.png 1 April, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సంతోషమే మానవాళికి మేలు

29-03-2025 06:28:05 PM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): మహిళల సంతోషమే ఆ కుటుంబానికి, సమాజానికి ఎంతగానో మేలు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతో ప్రాధ్యాన్నిస్తున్నట్లు  తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా, శిశు  వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 57,800 ప్రభుత్వ ఉద్యోగాలు పోస్టులు నియామకం చేసామని, వారిలో దాదాపు 40 శాతం మంది వరకు మహిళలు ఉన్నారని తెలిపారు. త్వరలో 14,800 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గత నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినప్పటికీ ఈ నెలాఖరు వరకు నిర్వహించుకునేలా అవకాశం కల్పించినట్టు తెలిపారు. డ్వాక్రా సభ్యులకు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కనున్న స్థలములో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చేయనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక పార్కు, బ్రిక్స్, రైస్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటులో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు.

మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాణి రుద్రమ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ముందుకుసాగాలని సూచించారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రజల మన్ననలు పొందుతున్నారని అభినందించారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని, నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో రోల్ మోడల్ నిలుపనున్నట్లు తెలిపారు. తనను గెలిపించిన ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్నానని, నిజాయితీ పరులైన అధికారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని అన్నారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... మహిళలు అభివృద్ధి ద్వారా కుటుంబం ఆర్థికాభివృద్ధి, జరుగుతుందని, తద్వారా తమ విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలను అందిస్తుందని అన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతున్న ‘అమ్మ పాలన’ ద్వారా బాలల బలవృద్ధికి కృషి జరుగుతోందని అభినందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ... "సృష్టికర్త అమ్మ అయితే, సృష్టించినదీ అమ్మే" అని, మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. బాలికల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, కొన్ని చోట్ల అమ్మాయి తెలియగానే గర్భంలోనే చంపేస్తున్న పరిస్థితి ఉందని, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమని, మార్పు కోసం ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 

కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అంగన్వాడీ సిబ్బంది కోలాటం, నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంగన్ వాడి సిబ్బంది ప్రదర్శించిన కోలాటం,  నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జిల్లా అధికారులను, అంగన్వాడీ సిబ్బందిని మెమెంటో శాలువా ప్రశంసా పత్రాలతో  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి,  జిల్లా మహిళా శిశు, వయోవృద్ధుల, దివ్యాన్గుల సంక్షేమ అధికారి మల్లీశ్వరి,  బీసీ, ఎస్సీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారులు శైలజ,  సునీత, కుసుమకుమారి, ఆర్డిఓ రవి, మహదేవపూర్ సిడిపిఓ రాధిక,  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.