05-03-2025 10:27:07 PM
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు..
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి..
సంగారెడ్డి (విజయక్రాంతి): క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం మహిళా దినోత్సవం మార్చి 8 ని పురస్కరించుకొని ముందస్తుగా జిల్లాలోని మహిళా ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాల మేరకు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో వివిధ అంశాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.
మహిళలతో కలిసి పోటీలో పాల్గొని చెస్, క్యారమ్స్ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహిళా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల మహిళల్లో ఆత్మ విశ్వాసం పొందడంతో పాటు మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుమతులు అందజేయున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహిళా ఉద్యోగులకు రన్నింగ్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, క్యారమ్స్, టెన్నికాయిట్, స్లో అండ్ ఫాస్ట్ వాక్, బ్లోయింగ్ బెలూన్స్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ, సెంట్రల్ యూనియన్ కార్యదర్శిలు నిర్మల రాజకుమారి, టిఎన్జీవో సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వేల్పూర్ రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గౌస్, సెంట్రల్ యూనియన్ ఆఫీస్, జిల్లా టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.