calender_icon.png 5 December, 2024 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే లక్ష్యం

05-12-2024 12:57:43 AM

  1. స్త్రీల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
  2. 106 షాపులతో మహిళా శక్తి బజార్ ఏర్పాటు
  3. నేడు గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళా శక్తి కేంద్రాలను నిర్మిస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలోనూ వారి కోసం శక్తిబజార్ పేరిట షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించింది.

మాదాపూర్‌లోని శిల్పారామంలో 106 షాపులను మహిళలకు కేటాయించారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు అప్పగించనున్నారు. తద్వారా మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ వస్తువులను మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ మహిళా శక్తి బజార్‌ను నిర్మించారు.

దీని కోసం రూ.9 కోట్లను వెచ్చిస్తోంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపుల్లో ఫుడ్ కోర్టులు, హాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ వస్త్రాలు వంటివి ప్రదర్శించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించడంతోపాటు ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ షాపులను నిర్వహించనున్నారు. 

ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..

ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగం గా గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మహిళా శక్తి బజార్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్షించారు. మహిళా శక్తి బజార్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.