26-04-2025 11:53:12 PM
ఎస్‌హెచ్‌జీ మహిళలు కోట్లు సంపాదించేలా పనిచేయాలి..
మహిళాశక్తి బజార్‌ను సందర్శించిన మంత్రి సీతక్క..
హైదరాబాద్ (విజయక్రాంతి): మహిళా సంఘం అంటే ఆర్థిక పద్ధతే కాదు.. సామాజిక రక్షణ కూడా అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా మహిళా సమాఖ్యలు చాలా కష్టపడుతున్నాయని, వారి కష్టానికి తగిన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధులతో కలిసి శనివారం శిల్పారామంలోని మహిళా శక్తి బజార్‌ని సందర్శించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ... కోట్ల రూపాయల ఆదాయాన్ని మహిళా సంఘాలు ఆర్జిస్తున్నాయని, ప్రతి గ్రూపు కోటి రూపాయలు సంపాదించేలా పనిచేయాలని ఆకాంక్షించారు. ఏ అండలేని సామాన్య సాధారణ గ్రామీణ మహిళలకు మహిళా సమాఖ్యలు ధైర్యం ఇస్తున్నాయని తెలిపారు.
మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు పుస్తక రూపం ఇవ్వాలని, ఆ పుస్తకాలు ఎందరికో ప్రేరణగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో లోన్ బీమా, ప్రమాద బీమా ఇవ్వడం వల్ల మహిళా సంఘాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మహిళా సంఘ సభ్యులు వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, పెట్రోల్ బంక్ నిర్వహణ, ఐకేపీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ, ఇతర అనుభవాలను వివరించారు. అనంతరం సీతక్క స్పందిస్తూ.. మహిళా సంఘాల కృషి అభినందనీయమని, ఎస్‌హెచ్‌జీలకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, ఫ్రీ బస్, సోలార్ ప్లాంట్స్, వడ్డీలేని రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌జీల సక్సెస్ స్టోరీలను విదేశీయులు వచ్చి వినడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా మిమ్మల్ని కలవకుండా వెళ్లే పరిస్థితి లేదని అభినందించారు.