calender_icon.png 24 September, 2024 | 3:48 AM

హర్యానాలో మహిళపై చిన్నచూపు!

24-09-2024 01:04:39 AM

  1. చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువే
  2. సంపన్న, రాజకీయ కుటుంబాలకే అవకాశం
  3. సామాన్య మహిళలకు ప్రోత్సాహం అంతంతమాత్రమే
  4. రాష్ట్ర ఆవిర్భావం నుంచి మహిళా ఎమ్మెల్యేలు 87 మంది మాత్రమే 
  5. ఇందుకు పితృస్వామ్య వ్యవస్థే కారణమని నివేదికల్లో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర పెంచేందుకు కేంద్రం ఇటీవల రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. అది అమలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈ చొరవతోనే కాకుండా కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది.

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే హర్యానాను పరిశీలిస్తే.. రాష్ట్రంలో స్త్రీచుపురుష నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంది. అదే తీరులో మహిళా చట్టసభ్యుల సంఖ్య కూడా రాష్ట్రంలో తక్కువగానే ఉంది. 1966లో పంజాబ్ నుంచి హర్యానా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి నుంచి హర్యానా రాజకీయాల్లో పురుషుల ఆధిపత్యమే కొనసాగుతోంది. 

87 మంది మాత్రమే.. 

హర్యానా రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల కాలంలో కేవలం 87 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలకు మొత్తం 1,031 మంది పోటీ చేస్తుండగా ఇందులో మహిళలు కేవలం 51 మంది ఉండటం గమనార్హం. అందులో ఎక్కువశాతం రాజకీయ కుటుంబ నేపథ్యం, సెలబ్రిటీ హోదా కలిగినవారే ఉన్నారు. పంజాబ్ రాజకీయాల్లో సామాన్య మహిళలకు అవకాశాలు అంతంతమాత్రంగానే లభిస్తాయి. తాజా ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 12 మంది మహిళా అభ్యర్థులను పోటీ చేయిస్తోంది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బీఎస్పీ కూటమి 11 మందిని, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ కూటమి 8 మందిని, ఆప్ 10 మంది మహిళా అభ్యర్థులను ప్రకటించాయి. అధికార బీజేపీ 10 మంది మహిళా నేతలను బరిలోకి దింపింది. 

జులానాలో రాజకీయ కుస్తీ

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ తరఫున జులానా సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి, డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్ కవితా దులాల్‌తో వినేశ్ పోటీ పడనున్నారు. దీంతో ఇద్దరు రెజ్లర్లు పోటీ చేస్తున్న జులానా నియోజకవర్గంలో రాజకీయ కుస్తీ ఆసక్తికరంగా మారింది. భారత సంపన్న మహిళగా ఖ్యాతి గడించిన సావిత్రి జిందాల్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా హిస్సార్ నుంచి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పిన హర్యానా మాజీ సీఎం బన్సీలాల్ మనువరాలు శృతి చౌదరి.. తోషం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు. గజ్జర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న హర్యానా మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత గీతా భుక్కల్.. అన్ని పార్టీలతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలను ఎన్నికల్లో పోటీ చేయిస్తున్న ఘనత తమదేనని చెప్పారు. గీతా ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హర్యానా మాజీ గవర్నర్ అఖ్లాక్..ఉర్ కిద్వాయ్ మనువరాలు రుబియా కిద్వాయ్‌ను నుహ్ స్థానంలో ఆప్ నిలబెట్టింది.    

సామాన్య మహిళలకు కష్టమే

హర్యానా అసెంబ్లీకి గత ఐదు ఎన్నికల్లో 47 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో అత్యధికంగా 116 మంది పోటీ చేయగా 13 మంది గెలుపొందారు. 2019లో 104 మంది అభ్యర్థుల్లో 9 మందే గెలిచారు. అశోక యూనివర్సిటీ త్రివేణి సెంటర్ ఫర్ పొలిటికల్ డాటా నిర్వహించిన సర్వే ప్రకారం.. హర్యానా రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యానికి ఎన్నడూ సరైన ప్రోత్సాహం లభించలేదు. గత 20 ఏళ్లలో మాత్రం మహిళా అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని, అయితే వీరు సంపన్న, లేదా రాజకీయ కుటుంబాలకు చెందినవారేనని నివేదిక వెల్లడించింది.

సామాన్యులకు అవకాశాలు లభించడంలేదని పేర్కొంది. హర్యానాలో ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థ నడుస్తోందని మహేంద్రగఢ్ సెంట్రల్ వర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చేవారికే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని, అందువల్ల సామాన్య మహిళలు రాజకీయాల్లో రాణించడం కష్టమని పేర్కొన్నారు.