calender_icon.png 6 January, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ అభ్యున్నతిలో మహిళలే కీలకం

04-01-2025 02:29:33 AM

సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకల్లో విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయారాజం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): మహిళలు విద్యావంతు లు కావడం ద్వారానే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని, ఇందుకు మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించాల్సిన అవసరం ఉందని విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయారాజం ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్రీయ నారీ సమాజ్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో మెహిదీపట్నం సప్తగిరినగర్‌లో శుక్రవారం సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయారాజం, బీసీ కమిషనర్ రాష్ట్ర మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విజయారాజం మాట్లాడుతూ.. సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటికే పరిమితమయ్యే మహిళలు చదువుకోవడం ద్వారా మొత్తం కుటుంబమే విద్యావంతులుగా తయారవుతారని చెప్పారు.

స్త్రీలకు ప్రత్యేక పాఠశా లలను స్థాపించి, మహిళల్లో విద్యా చైతన్యం నింపిన సావిత్రీబాయి యావత్తు ప్రపంచానికే ఆదర్శం అన్నారు. దేశంలో సావిత్రీబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన తొలి సీఎం రేవంత్‌రెడ్డి అని కొనియాడారు.

బీసీ కమిషనర్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. సమాజాన్ని పీడిస్తున్న మూఢనమ్మకాల నిర్మూలన కోసం సావిత్రీబాయి అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. అక్షర జ్ఞానం లేని మహిళ.. భర్త ప్రోత్సాహంతో చదువుకొని తిరిగి సమాజ ఉద్దరణకు చేసిన కృషితో దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కారని పేర్కొన్నారు.

అనేక పాఠశాలలను స్థాపించి తొలుత స్త్రీలకు విద్య నేర్పిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. రాష్ట్రీయ నారీ సమాజ్ జాతీయ అధ్యక్షురాలు చెంగయ్య లక్ష్మి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాతూరు రామకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నేతలు పోతుల నరేందర్‌గౌడ్, దాసు సురేశ్, సైదా బేగం, సరిత, విటోబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.