calender_icon.png 22 April, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్ పెట్టి భర్తను హత్య చేసిన భార్య

21-04-2025 07:13:21 PM

నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భార్య...

కూకట్ పల్లి,(విజయక్రాంతి): కట్టుకున్న భర్తకు కరెంట్ షాక్ పెట్టి హత్య చేసి పూడ్చిపెట్టిన సంఘటన కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణఖేడ్ పాత లింగాయపల్లికి చెందిన సాయిలుకి కవితతో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం కవిత ప్రవర్తన అనుచితంగా ఉండటంతో సాయిలు తన పిల్లలతో ఊరిలోనే పనిచేసుకుంటూ నివసిస్తున్నాడు. కవిత నగరానికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవనం సాగించేది తనకు తోచినప్పుడు ఊరికి వెళ్లి భర్తతో పిల్లలతో రెండు మూడు రోజులు గడిపి వచ్చేది కాగా ఈనెల 12వ తేదీ కవిత భర్తకు పని చూపిస్తానని నమ్మబలికించి నగరానికి తీసుకుని వచ్చింది.

కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ ప్రాంతంలో తన సోదరి జ్యోతి ఆమె భర్త మల్లేష్ పనిచేస్తున్న గుడిసెలో నివాసం ఉన్నారు.  ఈ నెల 18వ తేదీ రాత్రి భార్య ప్రవర్తనపై సాయిలు ఆమెను దూషిస్తూ ఉండగా కవిత కరెంటు వైర్ తీసుకొని అతడికి కరెంట్ షాక్ పెట్టి  హత్య చేసింది. మృతదేహాన్ని గోని సంచిలో కట్టి ఓ ఆటోలో వేసుకొని ఊరికి బయలుదేరి ఊరి శివారులో మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు యత్నించింది. భయపడిన ఆటో డ్రైవర్ ఎవరికి తెలువకుండా మృతదేహాన్ని ఎందుకు పూడుస్తున్నావు నేను ఇందుకు సహకరించను అని ఆమెతో పేర్కొన్నాడు. అయితే కవిత తను ఎక్కడినుంచి తీసుకొచ్చావో తిరిగి అక్కడికి తీసుకెళ్లాలని కోరింది. మృతదేహం తీసుకొని మల్లేష్ గుడిసెకు వద్దకు చేరుకుంది. కవిత తిరిగి రాగా జ్యోతి మల్లేష్ ల సహాయంతో మృతదేహాన్ని మిత్ర హిల్స్ పక్కనే ఉన్న నిర్మాణస్య ప్రదేశంలో పూడ్చి పెట్టారు. శనివారం కవిత ఊరికి తిరిగి వెళ్ళగా సాయిలు తల్లి కుమారుడు కుమార్తెలు తమ తండ్రి ఎక్కడ అని ప్రశ్నించారు. కవిత పొంతన లేని సమాధానాలు  చెప్పడంతో కవితపై వారికి అనుమానం ఏర్పడింది.

ఇదిలా ఉండగా సాయిలు మృతదేహాన్ని తరలించిన ఆటో డ్రైవర్ పోలీసుల వద్దకు చేరుకొని తన ఆటోలో వెళ్లిన కవిత పై అనుమానం వ్యక్తం చేస్తూ సమాచారం అందించాడు. సోమవారం ఉదయం పోలీసులు మల్లేష్ జ్యోతిలను అదుపులోకి తీసుకొని విచారించడంతో తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. కవితను విచారించగా తన భర్తకు హెచ్.ఐ.వి వ్యాధి ఉందని, అనుమానంతో తనను నిత్యం వేధిస్తూ ఉంటాడని ఆ వేధింపులు తాళలేక తాను ఈ హత్య చేసినట్లు తెలిపింది. కూకట్ పల్లి ఏసీపి శ్రీనివాసరావు, సిఐ రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలం తో పాటు మిత్రా హిల్స్ లోని జ్యోతి, మల్లేష్ నివాసం ఉంటున్న ఇంటిని పరిశీలించారు. తహసిల్దార్ సమక్షంలో మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుంచి ఉనికి తీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు తరలిస్తామని ఏసిపి శ్రీనివాసరావు తెలిపారు.