21-04-2025 01:46:42 AM
బ్లూ కోర్టు పోలీసులు స్పందించి ప్రాణాలు కాపాడారు సిబ్బందిని అభినందించిన ఎస్పీ
కామారెడ్డి, ఏప్రిల్ 20( విజయక్రాంతి ): ఒక మహిళ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా తక్షణమే బ్లూ కోర్టు పోలీస్ సిబ్బంది స్పందించి, సాహసోపేతంగా రక్షించిన ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. బ్లూ కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసు కో గా , బ్లూ కోర్ట్ డ్యూటీ పోలీసులు తమ ధైర్యంతో ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలిచారు. పిట్లం గ్రామానికి చెందిన గుణిజి సునీత కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు లోనై, గ్రామ శివాలయం సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు.
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే 100 నెంబర్కు సమాచారం అందించారు. సూచన అందిన వెంటనే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది రవిచంద్ర కానిస్టేబుల్, హోంగార్డు మారుతి తక్షణమే ఘటన స్థలానికి చేరుకొని, తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెరువులోకి దూకి బాధితురాలిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అనంతరం ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందేలా చేశారు. ఈ సాహసోపేతమైన చర్యను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రశంసించి, స్పందించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బంది, తమ సేవా ధ్యేయాన్ని ఈ సంఘటనలో మరోసారి నిరూపించారని ఎస్పీ తెలిపారు.