- కేసుల పేరుచెప్పి రూ.కోటిన్నరకు పైగా లూటీ
- ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించిన బాధితురాలు
- నిందితుడి అరెస్టు, నగదు రికవరీ
ఎల్బీనగర్, జనవరి 2: పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఎత్తుగడలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. ఇటీవల ఓ మహిళకు ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. నకిలీ కేసు పేరు చెప్పి ఆమె అకౌంట్ నుంచి భారీగా నగదు తస్కరించి సైలెంట్ అయ్యారు.
బాదిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరస్తుడిని అరెస్టు చేయడంతోపాటు పోగొట్టుకున్న నగదులో కొంత మొత్తాన్ని రికవరీ చేసి బాధితురాలకి అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... ఉప్పల్ ప్రాంతానికి చెందిన గీతా ఉపాధ్యాయ(65) అనే మహిళకు ఇటీవల గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.
ఫోన్ చేసిన వ్యక్తి తాను ముంబై సైబర్ క్రైమ్ అధికారి మోహన్‌శర్మ అని పరిచయం చేసుకున్నాడు. బాధితురాలికి ఆమె గుర్తింపు కార్డు చూపించి, మీ ఫోన్ నంబర్ పేరుతో కొందరు ప్రజలను వేధిస్తున్నారని, మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని, వీటిపై ఫిర్యాదు వచ్చాయని, బెదిరించాడు. చట్ట విరుద్దమైన కేసుల్లో మీ ఫోన్ నంబర్ వాడారని, దీనిపై కేసులు నమోదైనట్లు భయపెట్టాడు.
అనంతరం బాధితురాలి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పి, మరింత బెదిరించాడు. కేసుల నుంచి బయటపడాలంటే మేం చెప్పినట్లు చేయాలని, తనకు కొంత నగదు ఇస్తే కేసులను మాఫీ చేయిస్తానని మభ్యపెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి దఫదఫాలుగా కోటి 58 లక్షల 70 వేల రూపాయాలను సైబర్ నేరస్తుడు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు.
ఇప్పటివరకు జరిగిన విచారణను బయటకు చెప్పితే మరిన్ని చిక్కులు తప్పవని, తీవ్రమైన కేసులు నమోదు చేస్తానని భయపెట్టాడు. అనుమానం వచ్చిన బాధితురాలు ఎల్బీనగర్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన ఏసీపీ ఎస్.శివశంకర్ కేసు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరస్తుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ముంబైకి పంపించారు.
ఈ క్రమంలో సైబర్ నేరస్తులను పట్టుకోవడమే కాకుండా బాధితురాలు కోల్పోయిన నగదులో రూ.70లక్షల వరకు డబ్బులను రికవరీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు మురాదాబాద్ బ్రాంచ్ నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించి.. నగదును ఫ్రీజ్ చేసి, బాధితురాలికి ఇప్పించారు.
కేసు దర్యాప్తు చేసి, బాధితురాలకి న్యాయం చేయడంతోపాటు సైబర్ నేరస్తులను పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ, దర్యాప్తు బృందాల సిబ్బందిని సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు.