27-02-2025 11:05:39 PM
మహారాష్ట్రలోని పుణేలో దారుణం
పోలీస్ స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలోనే ఈ ఘాతుకం
సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు
పట్టిస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని పోలీసుల వెల్లడి
పుణే: పుణే బస్సు అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రద్దీగా ఉన్న బస్టాండ్‌లోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. స్వర్గేట్ పోలీస్ స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. దత్తాత్రేయకు నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. ఇప్పటికే దత్తాత్రేయపై దొంగతనం, దోపిడీ కింద ఆరుకు పైగా కేసులున్నాయి. 2019 నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితుడు తాజాగా మహిళపై అత్యాచారానికి పాల్పడి పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని పట్టించిన వారికి రూ.లక్ష బహుమతిగా అందిస్తామని పేర్కొన్నారు.
రాజకీయ దుమారం రేపిన అత్యాచార ఘటన
ఈ ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ లైంగిక దాడి ఘటనపై స్పందించారు. ‘ ఈ ఘటన చాలా దురదృష్టకరం, బాధ కలిగించేది. ఈ దారుణంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు’ అని అజిత్ పవార్ వెల్లడించారు. మరోవైపు మహిళపై లైంగిక దాడిని నిరసిస్తూ ఉద్ధవ్ శివసేన వర్గం (యూబీటీ) స్వర్గేట్ బస్టాండ్‌లోని సెక్యూరిటీ క్యాబిన్‌ను ధ్వంసం చేశారు. బస్టాండ్‌కు సమీపంలోనే దారుణం చోటుచేసుకున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది ఏం పట్టనట్లుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ ఆఫీస్‌లోని కిటికీలు, సామగ్రిని ధ్వంసం చేశారు. ఉద్దవ్ వర్గానికి చెందిన మహిళా కార్యకర్త బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయ్యాయంటూ నిరసన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా స్పందించారు. ‘నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కేవలం చట్టాలతోనే అలాంటి ఘటనలను నివారించలేం. మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. ఎక్కడికి వెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగించాలి. ఇలాంటి కేసుల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు కీలకం’ అని తెలిపారు.
అసలేం జరిగింది?
ఔంధ్ బనేర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల మహిళ స్వర్గేట్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో స్వర్గేట్ బస్టాండ్‌కు చేరుకొని ఫల్తాన్‌కు వెళ్లే బస్సు కోసం వేచి చూస్తోంది. ఈ సమయంలో దత్తాత్రేయ రాందాస్ మహిళ వద్దకు వచ్చి మీరు ఎక్కాల్సిన బస్సు మరో ప్లాట్‌ఫామ్‌పై ఉందని చెప్పి నమ్మించి ఖాళీగా ఉన్న శివ షాహి బస్సు దగ్గరకి తీసుకెళ్లాడు. అప్పటికీ బస్సులో లైట్లు వెలగకపోవడంతో అనుమానమొచ్చి ప్రశ్నించగా.. ప్రయాణికులు నిద్రలో ఉండడంతో లైట్లు ఆఫ్ చేశామని చెప్పాడు. దత్తాత్రేయ మాటలు నమ్మి బస్సులోకి ఎక్కగానే ఆమెను అనుసరించిన అతడు వెంటనే బస్సు డోర్ మూసేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. తనపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని స్నేహితురాలికి చెప్పగా.. ఆమె సాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.