30-04-2025 03:19:52 PM
పాత నేరస్తుడిని అరెస్టు చేసిన పోలీసులు
బంగారు, వెండి నగలు స్వాధీనం
కామారెడ్డి,(విజయక్రాంతి): భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగల కోసం ఆమెను హత్య చేశారని కామారెడ్డి ఎస్సీ రాజేష్ చంద్ర(Kamareddy SC Rajesh Chandra) తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళ హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఏప్రిల్ 20న కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో జరిగిన లక్ష్మీ హత్య కేసును చేదించినట్లుఎస్పీ తెలిపారు. లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ ఒంటరిగా జీవిస్తూ కూలీ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆమె కూతురు శిరీషకు వివాహం జరుగగా హైదరాబాద్ లో నివాసం ఉంటూ నిత్యం తల్లితో ఫోన్ లో సంభాషించేది.
ఈ నెల 20న ఒంటరిగా ఉన్న లక్ష్మీ ఇంటి వద్దకు పాత నేరస్తుడు అయిన గ్యారబోయిన శ్రీకాంత్ మాటల్లో దించి ఇంట్లోనే చీరతో ఉరి వేసి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలతో పరారీ అయ్యాడు. తన తల్లి నుంచి రెండు రోజులు గడిచిన ఫోన్ రాకపోవడంతో 23న ఆమె కూతురు శిరీష పక్కింటి వారి ద్వారా వివరాలు సేకరించగా లక్ష్మీ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణలో భాగంగా స్థానికంగా సీసీ కెమెరాలను పరిశీలించగా లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు గ్యారబోయిన శ్రీకాంత్ కదలికలు ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసు కొలిక్కి వచ్చింది. అతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సిఐ రవీంధర్ నాయక్, లింగంపేట్ ఎస్సైతో పాటు కానిస్టేబుళ్ళు మురళి, జవ్వి నాయక్ తో పాటు, ఐటి కోర్ సిబ్బంది శ్రీనివాస్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.