- కాగజ్‌నగర్‌లోని గన్నారం గ్రామంలో ఘటన
- పత్తి ఏరుతున్న కూలీ లక్ష్మికి తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో మృతి
- న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్29 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో పులుల గాండ్రింపుతో ప్రజలకు నిద్ర కరువైంది. పదిహేను రోజుల వ్యవధిలో కెర మెరి, జైనూర్, వాంకిడి మండలాల్లో పశువులపై దాడిచేసిన పులి శుక్రవారం కాగజ్‌నగర్ మండలంలోని బెంగాలి క్యాంపు 11 నంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మోర్లె లక్ష్మిపై దాడి చేసిం ది.
చేనులో పత్తి ఏరుతున్న లక్ష్మిపై వెనుకనుంచి పులి దాడి చేయడాన్ని గమనించిన మిగతా కూలీలు పెద్దపెట్టున అరవడంతో పులి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స చేస్తుండగానే మృతిచెందింది. లక్ష్మిపై దాడిచేసిన పులి ఆ తర్వాత విలేజ్ నంబర్ 9కి చేరుకొని అక్కడ ఆవుపై దాడి చేసింది. కాగా ప్రస్తుతం పత్తి ఏరుతున్న క్రమంలో పులులు పంజా విసురుతుండటంతో కూలీలు భయాందోళన చెందుతున్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన
పులి దాడిలో మృతి చెందిన లక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులు కాగజ్‌నగర్‌లోని అటవీశాఖ కార్యాలయం ఎదుట రోడ్డుపై మృతదేహన్ని పెట్టి అందోళన చేపట్టారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలయిందని వారు ఆరోపించారు. ఇందుకు కారణమైన బీట్, సెక్షన్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మృతురాలి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, ఎస్పీ శ్రీనివాస్‌రావు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందోళనకారులను నచ్చజెప్పడంతో వారు అందోళన విరమించారు. ప్రభుత్వం నుంచి అందించాల్సిన రూ. 10 లక్షల చెక్కును బాధిత కుటుంబసభ్యులకు అందించారు.
పల్లెలపై పులి పంజా
గతంలో 2020 నవంబర్ 11న సిడాం విగ్నేష్‌పై దాడి చేసి చంపింది. అదే సంవత్సరం నవంబర్ 29న పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మలను గ్రామ సమీపంలోని చేనులో పత్తి ఏరేందుకు వెళ్లిన సమయంలో పెద్దపులి దాడిచేసి చంపింది. 2023 నవంబర్ 16న వాంకిడి మండలంలోని చౌపక్‌గూడ్ పరిధిలో ఖానాపూర్‌కు చెందిన సిడాం భీం రైతుపై పులి దాడి చేయడంతో ఆయన మృతి చెందాడు.
పులి మనుషులపై దాడిచేసి చంపడంతో కోపోద్రిక్తులైన సమీప గ్రామాల ప్రజలు పులులకు విష ప్రయోగం చేశారు. ఇక పులులు పశువులపై దాడులు చేస్తుండడం సర్వసాధారణంగా మారింది. పులులు దాదాపు 130 పశువులకు పైగా దాడి చేయగా దాదాపుగా 80 వరకు మృత్యువాత పడ్డాయి.
గత ఏడాది జిల్లాలోని బెజ్జూర్, దహెగాం, పెంచికల్‌పేట్ ప్రాంతాలో పులులు ఎక్కువగా సంచరించగా ఈ ఏడాది ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, జైనూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో పులుల సంచారం పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి సరిహద్దు ఆటవీ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పులుల రాకపోకలు పెరిగినట్లు తెలుస్తుంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఎఫ్ శాంతారాం
ఉమ్మడి జిల్లాలో పులులు తిరుగుతున్నందున ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు. పశువుల కాపరులు, కూలీలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆటవీ ప్రాంత ప్రజలు ఉదయం 10 గంటల తరువాత బయటకు రావాలని సూచించారు. పులుల సంతా నోత్పత్తికి అనుకూలమైన కాలం కావున పులులు తిరుగుతాయని తెలిపారు.
పులి దాడిలో మృతి చెందిన లక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ప్రస్తుతం కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అం దించామని, దహన సంస్కారాలకు రూ. 20 వేల నగదు ఇచ్చామని చె ప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యో గం, ఐదు ఎకరాల భూమి, మరో రూ.10 లక్షల రూపాయల మంజూరుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయ డం జరుగుతుందన్నారు.