calender_icon.png 29 March, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తలను కడతేర్చిన భార్యలు

25-03-2025 11:46:14 PM

బెంగళూరులో కూతురితో కలిసి అల్లుడిని చంపిన అత్త..

ఆహారంలో మత్తు మందు కలిపి ఘాతూకం..

యూపీలో ప్రియుడి సహాయంతో భర్త హత్యకు పథకం..

భర్తను చంపేందుకు కిల్లర్‌కు 2 లక్షల సుపారీ..

బెంగళూరు/మీరట్: మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ రెండింటిలోనూ భార్యలే కట్టుకున్న భర్తను కడతేర్చడం శోచనీయం. మొదటిది కర్ణాటకలోని బెంగళూరు పరిధిలో జరిగితే.. రెండోది ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక కేసులో తమ కూతురును అల్లుడు వేధిస్తున్నాడన్న కారణంతో అత్త పక్కా పథకం ప్రకారం హత్యకు పాల్పడితే.. మరో కేసులో ఇష్టం లేని వివాహం చేశారని ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేయడం గమనార్హం. ఈ రెండు కేసుల్లోనూ భర్తలు హత్యకు గురవ్వగా.. భార్యలు కటకటాలపాలయ్యారు.

రహస్యంగా పెళ్లి.. ఆపై వేధింపులు

బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల లోక్‌నాథ్ సింగ్ రియల్ ఎస్టేట్ ఏంజెట్‌గా, లోన్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2022 నుంచి యశస్విని అనే యువతితో రహస్య సంబంధం నెరిపాడు. రెండేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ ఇద్దరు 2024 డిసెంబర్‌లో కునిగల్‌లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని యశస్విని కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వివాహం తర్వాత లోక్‌నాథ్.. యశస్వినిని వాళ్ల ఇంట్లో వదిలిపెట్టాడు. అయితే యశస్వినికి వివాహం అయినట్లు ఇంట్లో వాళ్లకు తెలిసింది. దీంతో లోక్‌నాథ్‌ను పిలిపించి అతడితో మాట్లాడి యశస్వినిని వెంట తీసుకెళ్లాలని కోరారు. లోక్‌నాథ్ అయిష్టంగానే ఒప్పుకోవడంతో అతడి ప్రవర్తనపై యశస్విని తల్లి హేమా బాయికి అనుమానమొచ్చింది. ఆరా తీయగా లోక్‌నాథ్‌కు ఇది వరకే పెళ్లయిందని తెలియడంతో లోక్‌నాథ్‌ను ఇంటికి పిలిపించారు. లోక్‌నాథ్‌ను యశస్విని నిలదీయగా.. ఈ విషయం ఇక్కడితో మరిచిపోవాలని హెచ్చరించాడు.

దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అల్లుడిని పథకం ప్రకారం హత్య చేయాలని హేమా బాయి భావించింది. యశస్వినితో భర్తకు ఫోన్ చేయించి మరోసారి మాట్లాడాలని, రమ్మని చెప్పించింది. బీజీఎస్ లేఔట్‌లో కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్‌కు రమ్మని చెప్పాడు. యశస్వినితో కలిసి అక్కడికి చేరుకున్న హేమ ఆహారంలో మత్తు మందు కలిపి లోక్‌నాథ్‌కు అందించింది. అది తిన్న లోక్‌నాథ్ స్పృహ కోల్పోయాడు. తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో  లోక్‌నాథ్ గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. లోక్‌నాథ్ కనిపించడం లేదంటూ అతడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భార్య యశస్విని, అత్త హేమా బాయిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా లోక్‌నాథ్‌ను తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇష్టంలేని పెళ్లి.. భర్త హత్యకు కుట్ర

ప్రియుడిని కాదని వేరే యువకుడితో ఇష్టం లేని పెళ్లి చేశారని భర్తను కడతేర్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ పరిధిలోని ఔరియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి నిరాకరించిన తల్లిదండ్రులు ఈ నెల 5న దిలీప్ అనే యువకుడితో బలవంతంగా వివాహం జరిపించారు. పెళ్లయిన రెండు వారాలకే దిలీప్‌తో కలిసి బతకడం ఇష్టం లేక అతడిని చంపేందుకు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలో దిలీప్‌ను హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీతో రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రామాజీ, తన అనుచరులు దిలీప్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులతో పాటు ప్రగతి, ఆమె ప్రియుడు అనురాగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.