calender_icon.png 20 November, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమానికి సాక్షిగా..

20-11-2024 12:00:00 AM

ఆదిలాబాద్‌లో ఉవెత్తున్న సాగిన తెలంగాణ ఉద్యమానికి సాక్షి ఈ వేదిక. గల్లీ నాయకుడు మొదలుకొని రాష్ట్రస్థాయి నేతల వరకు ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించినవారే. అదే ఆదిలాబాద్‌లో ‘తెలంగాణ సాధన దీక్షా శిబిరం’. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సుదీర్ఘంగా (1,523 రోజులు) సాగిన దీక్షగా పేరుంది. ఎంతో ఖ్యాతి సొంతం చేసుకున్న ఈ దీక్షా శిబిరం అమరుల జ్ఞాపకార్థంగా నేటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.దీక్షా శిబిరం కొనసాగినచోటే అమరవీరుల స్థూపం ఏర్పడి ఆనాటి తెలంగాణ ఉద్యమ త్యాగాలను గుర్తుచేస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్ ఆవరణలో ‘తెలంగాణ సాధన దీక్షా శిబిరం’ పేరిట సాగిన నిరాహార దీక్షలు తెలంణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయి. తెలంగాణ రాష్ర్ట సాధనే ధ్యేయంగా 1,523 రోజులపాటు నిరంతరాయంగా దీక్షలు కొనసాగాయి. 2010 జనవరి 4 నుంచి ప్రారంభమైన దీక్షలు.. 2014 మార్చి 6 వరకు జరిగాయి.

ఈ దీక్షలు సాగినన్ని రోజులు ఎంతోమంది ఉద్యమకారులు, మేధావులు, నాయకులు ఈ శిబిరాన్ని సందర్శించి తెలంగాణ ఉద్యమాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్‌తోపాటు జేఏసీ చైర్మన్ కోదండరాం, బండారు దత్తాత్రేయ, హరీష్ రావు, సినీ నటి విజయశాంతి, సీపీఐ నేత నారాయణ లాంటి ఎందరో సాధన దీక్షా శిబిరాన్ని సందర్శించి తమవంతు సంఘీభావం తెలిపారు.

అయితే ఈ దీక్షా శిబిరం కొనసాగిన చోటే అమరువీరుల స్థూపాన్ని నెలకొల్పారు. వారి జ్ఞాపకాలను ప్రతి ఏటా జూన్ 2న నెమరువేసుకుంటున్నారు. రాష్ర్ట అవతరణ దినోత్సవం రోజున అమరవీరుల స్థూపం వద్ద అధికారికంగా నివాళులర్పిస్తున్నారు. 

సహకరించిన ఉద్యమకారుడు

సుమారు నాలుగున్నర ఏళ్లు తెలంగాణ సాధన దీక్షా శిబిరం కొనసాగింది. ఇంతలా నిరాటంకంగా కొనసాగడానికి కారణం ఆదిలాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి, ఉద్యమకారుడు కారింగుల దామోదర్. సొంత పనులు మానుకొని తెలంగాణ రాష్ర్ట సాధన కోసం శిబిరాన్ని కొనసాగించారు. అందుకోసం రూ.4 లక్షలపైనే ఖర్చు పెట్టారంటే ఆయన స్ఫూర్తిని తెలియజేస్తోంది. ఈ శిబిరాన్ని దాదాపు 10 లక్షల మంది సందర్శించి ఉద్యమానికి మద్దతు తెలిపా రు.

50 వేల మంది ప్రత్యక్షంగా దీక్షా శిబిరంలో కూర్చొని తెలంగాణ సాధన పట్ల తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రతిరోజు దీక్షలు జరిగేలా ప్రణాళికను రూపొందించి ఆందోళనలు నిరంతరం కొనసాగేలా చూశారు. అయితే 1980లో ఉద్యమంలో పాల్గొన్న కారింగుల దామోదర్ మలిదశ ఉద్యమంలో తెలంగాణవాదిగా పాత్రను పోషించడం ఆనందంగా ఉందన్నారు.