22-03-2025 09:57:44 PM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు..
సంగారెడ్డి (విజయక్రాంతి): భూగర్భజలాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శనివారం కొండాపూర్ మండలంలోని తెర్పోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెర్పోల్ ఉన్నత పాఠశాలలో "సహాయ ఎన్జీవో" స్వచ్చంద సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ప్రపంచ జల దినోత్సవం అవగాహన సదస్సు నిర్వహించారు. పంచభూతాలలో నీరు ఒకటి అని నీరు లేనిది సమస్త జీవకోటికి మనుగడ లేదని కలెక్టర్ అన్నారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అవసరానికి మించి మనం నీటిని వృధా చేయడం వల్ల భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయన్నారు.
భూగర్భజలాల పెంపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీటిని ఎక్కడికక్కడ నిల్వచేసి భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం వల్ల భూగర్భజలాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు నీటి వృధాను అరికట్టవలసిన అవసరం ఉందన్నారు. అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని నీరు వృధా పోకుండా చూడాలని, గ్రామాలలో సింగిల్ ఫేస్ మోటర్ల కుళాయిల వద్ద నీటి వృద్దాపోకుండా, ఆన్ ఆఫ్ లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంకుడు గుంతలు ప్రతి ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇలానే నీటి వృధా చేస్తే భవిష్యత్తులో తాగునీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మన అవసరం మేరకు భూగర్భ జలాలు వృద్ధి చెందడం లేదని దీంతో భూగర్భ జలాలు తగ్గి బోరుబావులలో నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితి ఇకముందు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడడంతో పాటు వర్షపు నీటిని ఎక్కడిక్కడ నిలువచేసి భూగర్భ జలాల పెంపొందించడానికి కృషి చేయాలన్నారు.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ జలాల పెంపు కోసం చేపడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు భూగర్భ జలాల ఆవశ్యకతను తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నీటి వృధాను అరికట్టేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. జిల్లా భూగర్భ జలశాఖ అధికారి గంగ నర్సిములు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ రంగం భూగర్భ జలాలపై ఆధారపడి ఉందని, ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పెంపొందించేందుకు రైతులు పొలాల్లో వర్షపు నీరును ఒడిసి పట్టడానికి, నీటి కుంటల నిర్మాణాలను చేపట్టాలన్నారు.
జిల్లాలో ప్రధానంగా భూగర్భజలాల అదనపు వినియోగం, వృధాను నియంత్రించడానికి, ఆరుతడి పంటలను ఎంచుకొని బిందు సేద్యం పద్ధతులను పాటించాలని తెలిపారు. బోర్ వెల్ పాయింట్ కోసం రైతులు కొబ్బరికాయ పద్ధతులు అనుసరించకూడదని, రైతులు భూగర్భ జల శాఖను సంప్రదిస్తే బోర్ వెల్ పాయింట్ కోసం శాస్త్రీయంగా సర్వే చేసి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలతో విద్యార్థుల ద్వారా వారి తల్లితండ్రులకు, ఇతర రైతులకు, మహిళలకు భూగర్భజల సంరక్షణ పద్ధతులు, నీటి పొదుపు వివరాలను తెలియ చెప్పాలనేదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా, జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు డా"డి.వైద్యనాథ్ లు మాట్లాడుతూ... భూగర్భజలాల ప్రాముఖ్యత, సవాళ్లు, స్థిరమైన భూగర్భజల నిర్వహణ చర్యల గురించి విద్యార్థులకు వివరించారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, రైతులు, విద్యార్థులచే జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జల ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి, వారికి బహుమతులను, జిల్లా కలెక్టర్ ద్వారా అందచేయడం జరిగింది. జిల్లాలో భూగర్భ జలాలను ఉత్తమంగా నిర్వహిస్తున్నటువంటి, భూగర్భజలాల వినియోగ రుసుమును విధిగా చెల్లిస్తున్నటువంటి పరిశ్రమలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్, బాలరాజ్, మండల రెవెన్యూ అధికారి ఎస్తేర్, మండల పరిషత్ డెవలప్ మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ రవి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దశరథ్, సహాయ భూగర్భజల శాస్త్రవేత్తలు డా"సంతోష్ కుమార్, వజీయుద్దిన్, రవి, బాలకృష్ణ, ఎల్లన్న, వ్యవసాయ విస్తరణ అధికారి గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనశ్రీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.