calender_icon.png 23 October, 2024 | 3:09 PM

నీరు నిల్వకుండా.. వృథాగా పారకుండా

29-07-2024 12:47:47 AM

  1. వాటర్ లాగింగ్ సమస్యకు సంపులతో చెక్
  2. రూ.20 కోట్లతో 11 చోట్ల నిర్మాణానికి చర్యలు
  3. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పనులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): వర్షాకాలం సందర్భంగా నగరంలోని పలుచోట్ల రోడ్లమీద, కాలనీల్లో నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు  పడుతున్నారు. వర్షాకాలం తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ జలమండలి, నగర పోలీసులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా నగరంలోని వాటర్ లాగింగ్ పాయింట్ల (నీరు నిలిచే చోట) వద్ద నీరు నిల్వకుండా.. వృథాగా పారకుండా చర్యలు తీసుకుంటున్నారు.

వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద భారీ సంపులను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారుల అంచనా ప్రకారం నగరంలో 140 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో పలు ప్రధాన రహదారులు కూడా ఉన్నాయి. ఎక్కువ వర్షం కురిసిన సందర్భంలో ఇక్కడ నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి పరిష్కారం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగరంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధిలో రూ.20 కోట్ల వ్యయంతో దాదాపు 10 నుంచి 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో 11 ప్రాంతాల్లో సంపులను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. వాటర్ లాగింగ్ సమస్యకు సంపులతో చెక్ పెట్టాలని యోచిస్తోంది. అందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఈ నెల 10న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్ నగరంలో సంపుల నిర్మాణాల కోసం అనువైన స్థలాల కోసం పర్యటించారు. 

లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ వద్ద పనులు ప్రారంభం..

వర్షం కురిసిందంటే చాలు ఖైరతాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ వద్ద భారీగా నీళ్లు నిలిచిపోతాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ ఎదుట రూ.1.2 కోట్లతో సంపు నిర్మాణం పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. దాదాపు 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈ సంపును నిర్మిస్తున్నారు. మరో 10 చోట్ల కూడా వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఈ సంపు నిర్మాణం వల్ల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం నీళ్లన్నీ ఇందులోకి చేరడంతో రోడ్డుపై నిలవకుండా ఉంటాయి. సంపులో నుంచి నాలాకు ఉన్న కనెక్షన్ పైపుల ద్వారా హుస్సేన్ సాగర్‌కు చేరుతాయి. దానికితోడు అత్యవసరమైన సందర్భంలో మోటార్ల ద్వారా కూడా లిఫ్ట్ చేసి వర్షం నీటిని నాలాలోకి వదిలే విధంగా పనులు జరుగుతున్నాయి. 

సంపులను నిర్మించబోయే ప్రాంతాలు..

లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్, కేసీపీ జంక్షన్ మెర్కూరీ హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, ద్వారకా హోటల్, లక్కీ హో టల్, ఖైరతాబాద్ రైల్వేగేట్, ఖైరతాబాద్ పెట్రోల్ పంపు, జోయా లుక్కాస్, అమీర్‌పేట్ ఇమేజ్ హాస్పిటల్ సహా మరో రెండు ప్రాంతాల్లో సంపులను నిర్మించబోతున్నారు.