calender_icon.png 4 October, 2024 | 4:56 AM

పైసల్లేనిదే ఫైల్ ముందుకు కదలదు!

04-10-2024 02:04:57 AM

  1. కమర్షియల్ ట్యాక్స్‌లో రాజ్యమేలుతున్న అవినీతి
  2. ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులు
  3. లంచాలు అందవని ప్రమోషన్‌కు నో చెబుతున్న ఓ అధికారి
  4. అన్ని సెక్షన్లలో పెత్తనం చెలాయిస్తున్న మరో ఆఫీసర్ 
  5. పైఅధికారుల అండతో రెచ్చిపోతున్న కొందరు కిందిస్థాయి ఉద్యోగులు 

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నా.. ఏ మాత్రం భ యపడకుండా అక్రమార్కులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వసూళ్లకు అలవా టుపడిన పడిన ఓ అధికారి ఉన్న చోటు నుంచి కదలడానికి ఇష్టపడటం లేదు.

ప్రమోషన్ వచ్చినా వెళ్లేందుకు ఇష్టపడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కమిషనర్ కార్యాలయంలోని ఓ సెక్షన్‌లో పనిచేస్తున్న మరో అధికారి.. అదే కార్యాలయంలో తన పైఅధికారి అండతో ఇతర విభాగాల్లో పెత్తనం చెలాయిస్తున్నాడు. పైసలు ఇవ్వనిదే ఫైళ్ల వైపు తొంగిచూడనంటున్న ఇంకో సీనియర్ ఆఫీసర్.. ఇలా పలు కోణాల్లో కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది.

ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చే శాఖకు అవినీతి మరకలు అంటిస్తున్నారు. అవినీతికి పాల్పడతున్న ఆఫీసర్లు, సీనియర్ అధికారుల అండదండలతో కిందిస్థాయి ఉద్యోగులు కూడా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే ఆఫీసర్లు, సీనియర్లకు కూడా వారి పైస్థాయి అధికారులు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారన్న విమర్శలున్నాయి.

ముఖ్యంగా డీ, సీ, సర్వీస్, మెడికల్ సెక్షన్లలో వసూళ్ల పర్వం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వాణిజ్య పన్నుల శాఖ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. సీఐడీ కేసులు, ఏసీబీ దాడులతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు కమిషనర్ కార్యాలయంతో పాటు సర్కిల్ ఆఫీసుల్లో పని చేస్తున్న అధికారుల వ్యవహార శైలితో ఈ శాఖ మరోసారి చర్చ నీయాంశంగా మారింది.

వసూళ్లు బాగున్నాయ్.. ప్రమోషన్ వద్దు!

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రమోషన్ వస్తే సంబురపడతాడు. కానీ అబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారి మాత్రం ఇందుకు విరుద్ధం. తనకు వచ్చిన ప్రమోషన్‌ను నిరాకరిస్తున్నాడు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫీసులో వసూళ్ల దందా గిట్టుబాటు అవుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

వాస్తవానికి వాణిజ్య పన్నుల శాఖలోని పలువురు ఆఫీసర్లు ప్రమోషన్లతో ఇతర ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. గత పది నెలలుగా అధికారుల ప్రమోషన్స్ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రమోషన్ లిస్టులో అబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆ అధికారి పేరు కూడా ఉన్నట్లు సమాచారం.

అయితే ప్రమోషన్స్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్తే.. హైదరాబాద్‌లో వచ్చినంత ఆమ్యామ్యాలు రావనే ఉద్దేశంతోనే ఆ అధికారి పదోన్నతి తీసుకోవడం లేదన్నది ఆరోపణ. ఈ ఆఫీసర్‌కు కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఆఫీసర్ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరు కలిసి ప్రమోషన్స్ ప్రక్రియను కావాలానే ఆపుతున్నట్లు గుసగుసలు వినిపి స్తున్నాయి. దీని వల్ల ప్రమోషన్స్ లిస్టులో ఉన్న ఇతర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆఫీసర్ ప్రయోజనం కోసం తమనెందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

గుట్టలు గుట్టలుగా ఫైల్స్..

కమిషనర్ కార్యాలయంలోని సదరు సీనియర్ ఆఫీసర్ రూమ్‌లో ఫైళ్లు గుట్టలుగా పే రుకుపోయాయి. ఆయన ఎప్పుడూ తన రూమ్‌లో ఉండరనే విమర్శలున్నాయి. ఎవరైనా కలుద్దామని వెళ్లినా.. కుర్చీ ఖాళీగా కని పిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అ యితే ఫైళ్లు మాత్రం కుప్పలుకుప్పలుగా కనపడుతాయని చూసిన వాళ్లు చెబుతున్నారు. పైసలిస్తేనే ఆయన రూమ్ నుంచి ఫైల్ బయటకు వస్తుందన్న ప్రచారమూ ఉంది.

సిబ్బందిపై వేధింపులు..

ప్రమోషన్స్ వద్దంటున్న అబిడ్స్ సర్కిల్ కార్యాలయ అధికారి.. ఆ ఆఫీసులోని సిబ్బందిని సైతం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి వేధింపులు తాళలేక.. ఆఫీసులోని ముగ్గురు సెలవులపై వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు.. ఆ ఆఫీసర్‌పై ఇదివరకు కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా ఎలాంటి భయం లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. 

ఇతర సెక్షన్లలో పెత్తనం?

కమిషనర్ కార్యాలయంలో లీగల్ సెక్షన్‌లో పనిచేస్తున్న ఓ అధికారి తీరు చాలా వివాదాస్పదంగా మారింది. ఆయ న పనిచేస్తున్న సెక్షన్‌లో మాత్రమే కా కుండా.. ఇతర విభాగాల్లోనూ పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. ఈయన కు సంబంధం లేకపోయినా.. జీఎస్టీ వే బి ల్లుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

జీఎస్టీ పర్మిషన్ల విషయంలోనూ ఈ ఆఫీసర్ మి తిమీరిన జోక్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈయనకు కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని ఉన్నతాధికారి అండదండలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తు న్నాయి.

ఈ ఇద్దరు ఒకే ప్రాంతానికి చెం దిన వారని సమాచారం. ప్రాంతీయ అభిమానంతోనే ఉన్నతాధికారి.. లీగల్ సెక్షన్ లోని ఆ అధికారికి పూర్తి స్పేచ్ఛనిచ్చినట్లు తెలిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని.. జీ ఎస్టీ వే బిల్లులు, పర్మిషన్లు, రీఫండ్ అంశా ల్లో తన చేతివాటాన్ని ప్రదర్శిస్తూ.. అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం.

అనర్హులకు అందలం

కమిషనర్ ఆఫీస్‌లో పనిచేస్తున్న కొందరికి అర్హత లేకున్నా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అది కూడా అవినీతి ఆరోపణ లు ఎదుర్కొంటున్న వారికి జీఎస్టీ రీఫండ్ విభాగంలో నియమించడంతో అంతర్గతంగా విమర్శలు వచ్చాయి. కమిషనర్ రిజ్వీకి తెలియకుండా ఈ వ్యవహారాన్ని సీసీడబ్ల్యూలోని ఉన్నతాధికారి నడిపినట్లు సమాచారం.

ఆ తర్వాత విషయం తెలుసుకున్న కమిషర్ రిజ్వీ.. అవినీతి ఆరోపణలున్న సిబ్బందిని.. తమ పాత స్థానాల్లోకి పంపినట్లు తెలిసింది. ఆ తర్వాత అనర్హులను అందలం ఎక్కించిన సీసీడ బ్ల్యూలోని ఉన్నతాధికారిని హెచ్చరించినట్లు కార్యాలయంలో చర్చించుకుం టున్నారు.