- జియో, ఎయిర్‌టెల్ చార్జీల పెంపు అనవసరం
- బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల యూనియన్
న్యూఢిల్లీ, జూలై 3: ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ, 5జీ సర్వీసులు అందించపోతే ప్రైవేటు కంపెనీలతో పోటీపడలేదని ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వాపోయింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూని యన్ ఒక లేఖ రాస్తూ రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌లు ఇప్పటికే లాభాల్లో ఉన్నందున, ఆ కంపెనీలు చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని తెలిపింది.
గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ పోటీ కారణంగా ప్రైవేటు టెలికాం కంపెనీలు చార్జీల పెంపునకు వెనుకాడాయని, అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని యూనియన్ పేర్కొంది. ఇప్పటివరకూ 4జీ, 5జీ సర్వీసుల్ని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రారంభింలేకపోయిందని, ఫలితంగా ప్రైవేటు కంపెనీలకు పోటీని ఇవ్వలేకపోతున్నదని, దాంతో అవి టారీఫ్‌లను పెంచుతున్నాయని యూనియన్ లేఖలో వివరించింది. తాజాగా మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలు 10 శాతం మేర చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.
తప్పుదోవ పట్టించడమే..
ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయా న్ని పెంచుకోవడం కోసం టారీఫ్‌లు పెంచాల్సివస్తున్నదంటూ ప్రైవేటు ఆపరేటర్లు వాదిం చడం తప్పుదోవ పట్టించడమేనని బీఎస్‌ఎన్‌ఎల్ యూనియన్ ఆరోపించింది. ‘ప్రైవేటు కంపెనీలు వాటి చార్జీలను భారీగా పెంచడానికి ఏ మాత్రం కారణం లేదు. రిలయన్స్ జియో 2023 రూ. 20,607 కోట్ల నికరలాభాన్ని ఆర్జించగా, ఎయిర్‌టెల్ రూ. 7,457 కోట్ల నికరలాభాన్ని పొందిన విష యం గమనించాలి. అందుచేత సామాన్య ప్ర జలపై భారం వేసేంత భారీగా టారీఫ్‌లు పెం చడం ఏ మాత్రం అవసరం లేదు’ అని యూనియన్ లేఖలో మంత్రికి వివరించింది.
4జీ, 5జీ సర్వీసులు లేనందున బీఎస్‌ఎన్‌ఎల్ ఖాతాదారులను కోల్పోతున్నదని, ప్రైవేటు ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్‌లు కొత్త కస్టమర్లను సంపాదించుకుంటున్నాయని యూని యన్ తెలిపింది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ ద్వారా ప్రస్తుత 3జీ బీటిఎస్‌లను 4జీ బీటీఎస్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి, గ్లోబల్ వెండార్ల నుంచి 4జీ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రభుత్వం అనుమతించకపోవడం సంస్థను దెబ్బతీస్తున్నదని ఎంప్లాయీస్ యూనియన్ వాపోయింది.
బీఎస్‌ఎన్‌ఎల్ కొద్ది వారాల్లో 4జీ సర్వీసుల్ని ప్రారంభిస్తుందంటూ టెలికాం శాఖ మాజీమంత్రి అశ్విని వైష్ణవ్ 2023 మే నెలలో ప్రకటించారని, 2023డిసెంబర్‌కల్లా 5జీకి అప్‌గ్రేడ్ చేస్తామన్నారని, కానీ ఇప్పటివరకూ సంస్థ 4జీ సేవల్ని ప్రారంభించలేకపోయిందని యూనియన్ కొత్త మంత్రికి గుర్తుచేసింది. ఏ మాత్రం జాప్యం చేయకుండా 4జీ సేవల్ని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, తదుపరి దానిని 5జీకి అప్‌గ్రేడ్ చేయించాలని, అప్పుడే ప్రైవేటు కంపెనీల చార్జీల పెంపు నుంచి సామాన్యుడిని రక్షించగలుగుతామని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిని యూనియన్ కోరింది.