11-02-2025 12:00:00 AM
అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటి’. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లో జరిగిన ఓ యధార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుష్క ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తోంది. బాధితురాలి నుంచి నేరస్తురాలిగా మారుతుందట. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ఈ సినిమాలో గంజాయి అక్రమ రవాణా నేపథ్యం కూడా హైలైట్ కానుందని అంటున్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలను ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లోని అటవీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారని సమాచారం. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల్లో అనుష్క డూప్‌కి తావివ్వకుండా నటించిందట. క్రిష్ డూప్ సహకారం తీసుకుందామన్నా అవసరం లేదని తేల్చి చెప్పిందట.
సినిమాకు ఈ సీన్సే హైలైట్ కానున్నాయని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం అనుష్క ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందట. చిత్రానికి సంబంధించిన మరికొన్ని కీలక సన్నివేశాను మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతమైన దంతెవాడ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారని సమాచారం. ‘ఘాటి’ చిత్రాన్ని ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.