calender_icon.png 18 October, 2024 | 11:54 PM

కోత లేకుండానే..

22-07-2024 12:05:00 AM

ఓపెన్ హార్ట్ సర్జరీ లేదా బైపాస్ సర్జరీ అంటే ఇక మనిషి జీవితం అంతటితో ముగిసింది అనేలా భయపెట్టిస్తుంది. నిజానికి ఇదొక ప్రమాదకర హెచ్చరిక. శరీరాన్ని అదుపు తప్పేలా చేస్తుంది. ఇక జీవితానికి ఇదే చివరి పరీక్ష అని భయపడిపోతుంటారు. ప్రస్తుతం వైద్య శాస్త్రం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. గత రెండు దశాబ్దాలుగా వైద్య శాస్త్రం అత్యంత వేగంగా పరిణామం చెందింది. ఇలాంటి విప్లవాత్మక ఆవిష్కరణలు, క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు సైతం శస్త్ర చికిత్సలతో పని లేని, తక్కువ ప్రమాదంతో కూడిన మెరుగైన ఆరోగ్యానికి అవసరమైన పరిష్కారాలను అందించగలుగుతున్నాయి. ఇలాంటి మహత్తరమైన ఆవిష్కరణల మూలంగా గతంలో చికిత్సలకు సాధ్యం కాని గుండె చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 

అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, అత్యాధునిక సాంకేతికతలు గుండె సర్జరీలను సులభతరం చేసి, సాధ్యమైనంత చిన్న కోతతో, అత్యంత త్వరితంగా కోలుకోగలిగేలా సహాయపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ బైపాస్ సర్జరీ ప్రమాదం పెర్క్యుటేనియస్ ప్రక్రియలను అధిగమించి అన్ని రకాల ప్రత్యామ్నాయ చికిత్సలను విశ్లేషించి, ఎక్కువ ప్రయోజనం, తక్కువ ప్రమాదంతో కూడిన అవకాశాలను వైద్యులు కల్పించారు. ఈ ప్రక్రియ మూలంగా కార్డియాక్ సర్జన్స్ బృందంతో కూడిన ”హార్ట్ టీమ్ డెసిషన్ మేకింగ్‌“ విధానం అమల్లోకి వచ్చింది. అందువల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఈ వివరాలు తెలుసుకునేందుకే ఈ కథనం...

మనిషి గుండెలో నాలుగు గదులు ఉంటాయి. వాటితో పాటు నాలుగు కవాటాలూ ఉంటాయి. ఇంగ్లిష్‌లో వాటిని వాలవ్స్ అంటారు. వీటిల్లో రెండు కుడివైపున, మరోరెండు ఎడమవైపున ఉంటాయి. కుడివైపు ఉండే కవాటాలను ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అనీ, ఎడమవైపున ఉండేవాటిని మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ అని అంటారు. గతంలో వీటి మార్పిడి జరగాలంటే తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమయ్యేది. దాంతో గుండెను పూర్తిగా తెరిచే ఓపెన్హార్ట్ సర్జరీ చేసేవారు. దీనివల్ల గాయం మానడానికి చాలా సమయం పట్టేది. హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధీ పెరిగేది. కానీ ఇప్పటి పురోగతి, సదుపాయాలతో శస్త్రచికిత్స లేకుండానే కవాటాల మార్పిడి జరుగుతోంది. 

శరీరంలోని అన్ని భాగాల నుంచి గుండెకి చేరిన రక్తం వినాకేవే అనే రక్తనాళాల ద్వారా కుడివైపు పైగదికి చేరుతుంది. అక్కడి నుంచి కుడివైపు కిందిగదికి రక్తం ప్రవహిస్తుంది. అక్కడి నుంచి ఈ రక్తం పల్మునరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. కుడివైపున పైగదికీ, కింది గదికీ మధ్య ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. ఇది ఒకసారి కింది గదికి చేరిన రక్తాన్ని తిరిగి మళ్లీ పైగదిలోకి వెళ్లకుండా నివారిస్తుంది. ఇక కుడివైపు కింది గదికీ... పల్మనరీ ఆర్టరీకి మధ్యన పల్మనరీ వాల్వ్ ఉంటుంది. ఇది పల్మునరీ ఆర్టరీకి చేరిన రక్తాన్ని తిరిగి కిందిగదికి చేరకుండా కాపాడుతుంది. ఇదేవిధంగా గుండెకి ఎడమవైపున పైగదికీ, కింది గదికీ మధ్య మైట్రల్ వాల్వ్, కింది గదికీ... ఆయోర్టా అనే రక్తనాళానికి మధ్యన అయోర్టిక్ వాల్వ్ ఉంటాయి. ఈ విధంగా కవాటాలు రక్తాన్ని వెనక్కు ప్రవహించకుండా నిరోధించడం ద్వారా గుండెలో రక్తమంతా ఒక క్రమపద్ధతిలో ప్రవహించేందుకు తోడ్పడుతుంటాయి.

చిప్, సిటిఓ చికిత్సలు అంటే?

యాంజియోప్లాస్టీ లాంటి స్టెంట్ వేసే గుండె చికిత్సల్లో 80 శాతం రోగులకు ఎటువంటి ప్రధానమైన సవాళ్లు ఎదురుకావు. అయితే గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో సమస్య ఉన్న రోగులు, అలాగే ఇతరత్రా అవయవాలు (కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు) సమస్యలు కలిగి ఉన్న రోగులు, గుండె రక్తనాళాల్లో క్లిష్టమైన అడ్డంకులు కలిగిన రోగుల విషయంలో ఇదే చికిత్సలో సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాంజియోప్లాస్టీ పెద్ద సవాలుగా మారుతుంది. పైన పేర్కొన్న అనేక కారణాల వల్ల స్టెంట్ తో కూడిన యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీల్లాంటి గుండె చికిత్సలు క్లిష్టంగా మారతాయి.

ఇలాంటి రోగుల చికిత్సకు ముందు గుండె వైద్యుల బృందం రోగుల పరిస్థితిని కుణ్ణంగా విశ్లేషించి, వారి ఆరోగ్య స్థితిని బట్టి తగిన వైద్య చికిత్సను ఎంచుకోవడం జరుగుతుంది. ఒక దశాబ్దం క్రితం ఇలాంటి రోగులకు శస్త్రచికిత్స బృందం చికిత్సను తిరస్కరించిన సందర్భాల్లో వారిని బైపాస్ సర్జరీ లేదా మెడికల్ థెరపీకి పంపించడం జరిగేది. మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ పరికరాలు, గ్యాడ్జెట్లు అందుబాటులోకి రావడంతో వీటి సహాయంతో నేడు క్యాల్సిఫైడ్ లీజన్స్ లాంటి క్లిష్టమైన గుండెలోని అవరోధాలను సిటిఓ, కొరొనరీ ఇమేజింగ్ మెథడాలజీల సహాయంతో పెర్క్యుటేనియస్ థెరపీలను అందించడం జరుగుతోంది. 

గుండె కవాటాలు ఎందువల్ల దెబ్బతింటాయి?

గుండె కవాటాలు దెబ్బతినడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మన దేశంలో రుమాటిక్ హార్ట్ డిసీస్ అనే జబ్బు కవాటాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ఇదేకాకుండా పెరుగుతున్న వయసుతో పాటు క్రమంగా జరిగే కాల్సిఫికేషన్ వల్ల గానీ, లేదా గుండె రక్తనాళాల జబ్బులతో, అలాగే పుట్టుకతోనే బలహీనంగా ఉన్న కవాటాల వల్ల, వాటితో పాటు ఇన్ఫెక్షన్లు లేదా డయాబెటిస్ వల్ల కూడా గుండె కవాటాలు దెబ్బ తినే అవకాశం ఉన్నది.

కవాటాలు దెబ్బ తింటే?

గుండె కవాటాలు దెబ్బతిన్నప్పుడు రక్తం వెనక్కి వెళ్ళటం లేదా వెళ్లాల్సినంత సాఫీగా ముందుకు వెళ్లకపోవటం జరగవచ్చు. వీటిల్లో మొదటి దాన్ని రీగర్జిటేషన్ అని, రెండవ దాన్ని స్టీనోసిస్ అనీ పిలుస్తారు. కవాటాలు దెబ్బతిన్నప్పుడు రక్తప్రవాహంలో ఇబ్బందుల వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా గుండె ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. 

కవాటాల చికిత్సలో ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిణామాలివి...

మునుపటిలా కాకుండా ఇప్పుడు గుండె కవాటాల మార్పిడి తొడ ద్వారా అమర్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. గడచిన పది సంవత్సరాల్లో జరిగిన సాంకేతికమైన అభివృద్ధి ఇందుకు దోహదపడింది. గుండెలో నాలుగు కవాటాలనూ కాలి నుంచే మార్చేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు సమకూరింది. వీటిలో అత్యధికంగా చేస్తున్న ప్రక్రియ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దీన్ని టావర్ (టీఏవీఆర్) అనీ, టావి (టీఏవీఐ) అని గాని పిలుస్తారు.

ఈ సాంకేతికత మన దగ్గరా ఉందా?

తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రధానమైన ఆసుపత్రుల్లో ఇలా కాలి ద్వారా చేసే చికిత్స ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఇప్పటికి ఈ చికిత్స కాస్త ఖరీదైనదే. భారతదేశంలో తయారైన కృత్రిమ కవాటాలు అమర్చేందుకు సుమారుగా 15 లక్షలు, అలాగే పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయిన కవాటాలను అమర్చేందుకు సుమారుగా 25 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో మరింత చవకగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

శస్త్రచికిత్సతో పోలిస్తే టావర్‌తో ప్రయోజనాలివి...

కవాటాలకు సంబంధించిన శస్త్రచికిత్సలో ఛాతీని పూర్తిగా తెరిచిన తర్వాతే కవాటాన్ని మార్చడం సాధ్యమవుతుంది. అందువల్ల ఈ తరహా శస్త్రచికిత్సలన్నీ ఓపెన్ హార్ట్ పద్ధతిలోనే జరగాల్సి ఉంటుంది. దీనికోసం పూర్తిస్థాయిలో మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ‘టావర్’ చేసేటప్పుడు మత్తు ఇవ్వాల్సిన అవసరం కాని, గుండెని ఓపెన్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు. తద్వారా టావర్లో త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. శస్త్ర చికిత్సకు సంబంధించిన అనేక దుష్ఫలితాలు ఉండవు. ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బు, పక్షవాతంలాంటి సమస్యలు ఉన్నవారికి, ఎక్కువ వయసు ఉన్నవారికి, గుండె పంపింగ్ సామర్థ్యం బాగా తక్కువగా ఉన్న వాళ్లకి శస్త్రచికిత్స కన్నా టావర్ బాగా ఉపయోగపడుతుంది.

శస్త్రచికిత్స లేకుండా మైట్రల్ వాల్వ్ చికిత్స పద్ధతులు

ఇందులో మైట్రా క్లిప్ అని, టిఎమ్‌వీఆర్ అనే రెండు ప్రధానమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా గుండెని ఓపెన్ చేయకుండానే అంటే... శస్త్ర చికిత్స చేయకుండానే మైట్రల్ వాల్వ్‌ని రిపేర్ లేదా రీప్లేస్ చేయవచ్చు. ఇదేవిధంగా గుండెకి కుడివైపు ఉన్న కవాటాలకు టీపీవీఆర్ లేదా ట్రిక్ వాల్వ్ అనే పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి.

ఇంపెల్లా సహాయంతో..

సాధారణంగా యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మూడు రక్త నాళాల్లో చాలా క్రిటికల్ గా బ్లాక్స్  ఉన్నా బైపాస్ సజేస్ట్ చేస్తారు. బైపాస్ కు బదులుగా ఆత్యాధునిక టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నది ప్రస్తుతం. మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డివైజ్-పెర్క్యుటేనియస్ ఎల్ విఎడి (ఇంపెల్లా) ద్వారా క్లిష్టమైన గుండె అవరోధాలతో (క్యాల్సిఫైడ్ బ్లాకేజెస్, ఎడమ ప్రధాన కొరొనరీ ఆర్డెరీ మొదలైన) పంపింగ్ డిస్ ఫంక్షన్ కలిగి ఉన్న రోగుల చికిత్సలో ఇదొక ప్రధానమైన పురొగతి. ఈ చికిత్సలో కటి ప్రదేశం లేదా ఆక్సిల్లా రక్తనాళం ద్వారా పంప్ ను గుండె దగ్గరకు పంపించడం జరుగుతుంది. దాంతో చికిత్స సమయంలో గుండెకు రక్త ప్రసరణ, రక్తపోటు స్థిరంగా ఉంటాయి.

హీమోడైనమిక్స్ తో కూడిన ఇంపెల్లా వల్ల పీసీ ఐ అనేది చికిత్సలో అవరోధం ఏర్పడకుండా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ రక్తనాళాల చికిత్సలో సిటిఓ, క్యాల్షియం మాడిఫికేషన్ లకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రక్తపోటును స్థిరంగా ఉంచడం అవసరం. చికిత్స పూర్తయిన తర్వాత వేర్వేరు పరిస్థితులు, అవసరాలను బట్టి ఇంపెల్లాను వెంటనే లేదా కొన్ని గంటలు, రోజుల తర్వాత తొలగించడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొందరు రోగులకు తక్కువ ఖర్చుతో కూడిన విఎ-ఎక్మోను ఉపయోగించడం జరుగుతుంది. అన్ని అవరోధాలను వ్యాకోచించేలా చేయడంలో ఈ పరికరాలు కీలకంగా మారి, దీర్ఘకాల ఫలితాలను అందించడంలో సహాయపడతాయి. అయితే అత్యధిక స్తాయిలో విజయవంతమైన శస్త్రచికిత్సలు చేయగలిగిన వైద్యులు మాత్రమే ఈ చికిత్సలు చేయవలసి ఉంటుంది. - 

 డాక్టర్ రవీంద్ర అముజూర్

ఎమ్డీ, డీఎమ్.

సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్

మెడికవర్ హాస్పిటల్, చందానగర్