ఎమెర్జెన్సీ సినిమా పేరుతో బీజేపీ నాటకాలు
కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రధాని మోదీ.. ఇందిరాగాంధీ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు వినయ్‌కుమార్, లింగంయాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను పెట్టి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన పెద్దలు ఎమర్జెన్సీ పేరిట సినిమా తీస్తున్నారని.. దీని ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్‌ను దెబ్బతీయటమే అని కోదండరెడ్డి ఆరోపించారు.
ఎమెర్జెన్సీ సినిమా విడుదలను నిలిపివేయాలని ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమెర్జెన్సీ ఎందుకు పెట్టారో ప్రజలందరికీ తెలుసని.. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎమర్జెన్సీని సమర్థించిందన్నారు. ఎమర్జెన్సీ పేరిట సినిమా తీసి ప్రజలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కోదండరెడ్డి విమర్శించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. బీజేపీ మాయలో వారు పడరన్నారు.