11-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గాలివాన విద్యుత్ శాఖకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో పాటు అనేకచోట్ల విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. మరికొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్ సిబ్బంది మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. మహబూబాబాద్ డివిజన్ వ్యాప్తంగా సుమారు 30 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు గాలివాన అంతరాయం కలిగించింది. 155 విద్యుత్ స్తంభాలు పెనుగాలులకు నేలకూలాయి. అలాగే నాలుగు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
అనేక చోట్ల చెట్లు విరిగి విద్యుత్ లైన్ల పై పడడంతో పెద్ద ఎత్తున విద్యుత్ లైన్లు తెగిపోయాయి. ఇందులో ఇప్పటివరకు 130 స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన కొత్తవి నాటి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అలాగే వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి మరో 20 విద్యుత్ స్తంభాలు కొత్తవి నాటే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
విద్యుత్ శాఖ అధికారులతో సహా ఉద్యోగులు, సిబ్బంది మూడు రోజుల నుండి రేయింబవళ్లు కష్టపడి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం అహర్నిశలు శ్రమించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్ ఈ నరేష్, డిఈ విజయ్, సహాయ ఇంజనీర్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, దిగువ స్థాయి సిబ్బంది మూడు రోజులు నిద్రాహారాలు మాని విద్యుత్ సరఫరాను జిల్లా వ్యాప్తంగా పునరుద్ధరించారు.