బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, న్యాయవాది సోమ భరత్
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): క్వాష్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం వేరు, కొట్టివేయడం వేరని.. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సోమభరత్ స్పష్టంచేశారు. ప్రపంచం మొత్తంలో 9 నగరాల్లోనే ఫార్ములా ఈ-కార్ రేసు జరుగుతోందని, ఈక్రమంలో హైదరాబాద్‌కు ఫార్ములా ఈ రేసును రప్పించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని తెలిపారు.
సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ అంశంపై బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచేందుకు ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహించారని తెలిపారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై బూటకపు కేసు పెట్టారని, ఆయన ఎప్పుడూ విచారణను వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. ఫార్ములా కేసులో క్రిమినల్ ఆధారాలు లేవని కోర్టు నమ్మిందని చెప్పారు.
సోనియా, రాహుల్‌లో నేషనల్ హెరాల్డ్ కేసు అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకున్న సందర్భం ఉందని, సుప్రీంకోర్టు చెప్పింనదుకే కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్‌డ్రా చేసుకున్నారని స్పష్టంచేశారు. దర్యాప్తు సంస్థ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ చెప్పారని సోమభరత్ పేర్కొన్నారు.