08-02-2025 12:00:00 AM
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన శ్రీకాంత్ అడ్డాల.. ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. శ్రీకాంత్ సినిమాలు అంటే తెలుగుతనం ఉట్టిపడుతుందన్న నమ్మకం ఏర్పడింది. అదే క్రమంలో ‘బ్రహ్మోత్సవం’ మెప్పించలేదు. తర్వాత రూట్ మార్చి, విక్టరీ వెంకటేశ్‌తో ‘నారప్ప’ చేశారు.
ఇది తమిళంలో హిట్ అయిన ‘అసురన్’కు రీమేక్‌గా కాగా, ప్రేక్షకాదరణ లభించింది. తాజా సమాచా రం ప్రకారం.. ఈసారి ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట శ్రీకాంత్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరహాలో కథతోనే వస్తున్నట్టు సమాచారం. ‘సీతమ్మ వాకిట్లో..’లో అన్నద మ్ముల కథ చెప్పిన శ్రీకాంత్ ఈసారి అక్కాచెల్లెళ్ల కథను సిద్ధం చేసుకున్నారు.
పెద్దోడు, చిన్నోడుగా వెంకటేశ్, మహేశ్ సందడి చేసిన పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో’ లాగే ఇది కూడా ఫ్యామిలీస్‌ను మెప్పిస్తుందని టాక్. అక్కాచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగాలను ఇతివృత్తంగా చేసుకొని రూపొందనున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించబోతున్నారట.
ఈ చిత్రానికి ‘కూచిపూడి వారి వీధిలో’ అనే ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేయించారు. పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం కథానాయికలను వెతికే పనిలో ఉన్నారట శ్రీకాంత్. హీరోయిన్లు ఫిక్స్ అవ్వడమే తరువాయి సినిమాకు కొబ్బరికాయ కొట్టేయనున్నారు.