calender_icon.png 15 November, 2024 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నదుల శుద్ధితోనే బంగారు భవిష్యత్తు

13-11-2024 12:00:00 AM

మన దేశంలో యముననుంచి మూసీవరకు దాదాపు అన్ని నదీనదాలు కలుషితం కావడం అత్యంత విషాదం. ఇది భవిష్యత్ తరాలకు ప్రమాద సూచికను తెలియజేస్తున్నది. భారతదేశం సుసంపన్నమైన సహజ సంపదకు నిలయం. అందమైన ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, నీటి వనరులతో భౌగో ళికంగా అత్యంత అనుకూలమైన జీవన పరిస్థితులకు నెలవు. అనేక నగరాలు ఆయా నదుల ఒడ్డున ఉన్నాయి. నీటి పారుదల, రవాణా, తాగునీరు మొదలైన వాటికి నదులు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

కానీ, దురదృష్టవశాత్తు మానవాళి సృష్టిస్తున్న వ్యర్థాలు అన్నీ ఈ నదుల్లోకి వచ్చి చేరుతుండడం ఇవాళ పెద్ద సమస్యగా పరిణమించింది. పారిశ్రామికీకరణతో అనేక పరిశ్రమల వ్యర్థాలను వీటిలోకి వదులుతుండడం మరో విపరిణామం. నదులు, జలవనరులలో కూడుతున్న కాలుష్యాలలో రసాయన వ్యర్థాలు ప్రాణాంతకమే. వీటిలో భారీ లోహాలు, రేడియో ధార్మిక పదార్థాలు, ప్లాస్టిక్స్, చముర్లు వంటివన్నీ ఉంటున్నాయి. 

కాలుష్య కారకాలవల్ల ఆయానదుల జలాలు ఎందుకూ పనికి రాకుండా పోవడమేకాక జీవజాతుల మనుగడకే సవాలు విసురుతున్నాయి. వివిధ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులు, ప్రమాదకరమైన మృతదేహాల శిథిలాలు మొదలైన వాటిని నదుల జలాలు రవాణా చేస్తుంటాయి. అనేకమంది వివిధ మృతదేహాలను ఎటువంటి ఆలోచన లేకుండా నదుల్లోకి విసిరి వేస్తుంటారు. వీటికి తోడు మురుగు, మలమూత్రాలనూ నీటిలోకి వదులుతుండడం సహజమైపోయింది.

నదులలోని జలచరాలకైతే జీవన్మరణమే. ఈ దుష్ఫ్రభావం భూమిమీది జీవులకు సోకుతుంది. ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యంత కలుషితమైన నదులలో గంగా, యమున, సబర్మతి వంటివి ఉన్నాయి. ఈ నదుల తీర ప్రాంతాలు దేశంలోని అనేక అత్యంత అభివృద్ధి చెందిన నగరాలకు నిలయంగానూ ఉన్నాయి. పవిత్ర నదులలో అనేక మతపరమైన ఆచారాలు సైతం నిర్వహిస్తుంటారు. సామూహిక స్నానాలు, వివిధ ఆచారాలు నదుల జలాలను కలుషితం చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

అంతేకాక గృహ, వ్యవసాయ వ్యర్థాలూ హర్యానా వంటి ప్రాంతాలలో అయితే పురుగు మందులు, వ్యవసాయ వ్యర్థాలతోనూ నదులు కలుషితమవుతున్నాయి. కాలుష్యం నుంచి వీటిని సంరక్షించడం పెద్ద సవాలుగానే మారింది.

ప్రజలలో అవగాహన పెరగాలి

ఈ సమస్యపై ప్రజలకు లోతైన అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. నీటి కాలుష్య ప్రమాదకర ప్రభావాలను అందరూ అర్థం చేసుకోవాలి. ఆయా స్థానిక ప్రభుత్వాలు పట్టణాలు, నగరాలలో సరైన మురుగునీటి వ్యవస్థను నిర్మించాలి. సక్రమమైన వ్యర్థాల నిర్వహణతోనే నదులను కాపాడుకోగలం. ఇందుకు కఠినమైన నిబంధనలు రూపొందించాలి. మానవజాతి మనుగడకు నదుల శుద్ధి, సంరక్షణను తప్పనిసరిగా భావించాలి.

ప్రజలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండి నదులను కాపాడాలి. కృష్ణానది ఉపనది అయిన మూసీ అనంతగిరి కొండల్లో జన్మించి హైదరాబాద్ మహానగరం చేరుకోగానే పూర్తి కాలుష్యమయమవుతున్నది. ఈ మూసీ జలాలే ఒకప్పుడు పట్నం ప్రజలకు తాగునీరు కాగా, నేడు అవి విషంగా మారాయి. మూసీ పరీవాహక ప్రాంతాలన్నీ ఇవాళ భయానక దుర్గంధ పూరితమైనాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన అభినందనీయం. దేశంలోని మిగిలిన నదుల ప్రక్షాళనకూ ఆయా ప్రభుత్వాలు, కేంద్రం నడుం బిగించాలి.

- రాగిఫాని బ్రహ్మచారి