30-04-2025 12:42:46 AM
365బీ జాతీయ రహదారి నిర్మాణం
* రైతులకు నష్టం లేకుండా ప్రత్యామ్నయ మార్గం
* హామీ ఇచ్చిన కేంద్ర అధికారులు
సిద్దిపేట, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): సూర్యాపేట సిద్దిపేట మీదుగా సిరిసిల్లకు వెళ్లే 365బీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోతున్న రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.
ఈ రహదారి ప్రాజెక్టు వలన పలు గ్రామాల్లో రైతులు విలువైన సాగుభూములను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రైతుల తరఫున మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చొరవ తీసుకొని, రైతుల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్కు వినతిపత్రం సమర్పించారు.
దుద్దేడ, ఎన్సాన్పల్లి, మార్పడగ, బురుగుపల్లి, ఖమ్మంపల్లి, తడక్కపల్లి, చిన్న గుండవెల్లి, పూల్లూరు, మల్యాల గ్రామాల్లో రైతులు కోల్పోతున్న భూముల వివరాలను అధికారికి వివరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు, కాలువల నిర్మాణం కోసం ఇప్పటికే భూములను కోల్పోయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సుమారు ఒక గంట పాటు వివరించి, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారుల ముందుంచారు.
రైతులకు భూముల నష్టం లేకుండా రాజీవ్ రహదారి, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసే మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ అంశాన్ని అధికారులూ సానుకూలంగా స్వీకరించి, ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వేను తాత్కాలికంగా నిలిపి వేసి, మార్గాన్ని పునఃపరిశీలించి, కొత్త అన్లైన్మెంట్ ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో సంబంధిత గ్రామాల్లోని రైతుల్లో ఆనందం, ఊపిరి పీల్చుకున్న భావం నెలకొంది.
ఎంపీ రఘునందన్ రావు చూపిన చొరవ రైతుల భవిష్యత్కి రక్షణగా నిలిచిందని అన్నదాతలు అభినందిస్తున్నారు. భూముల్ని కోల్పోకుండా మా జీవనాధారాన్ని కాపాడుకునే మార్గం లభించింది‘ అంటూ రైతులు గడిగల రాజిరెడ్డి, రామచంద్రారెడ్డి ,మడుపు రాంరెడ్డి, ఎరోళ్ల నర్సింలు, భైరినేని సందీప్ రావు, బొడిగె తిరుపతి, చెల్ల రాజలింగం ఎంపీ రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, బీజేపీ నాయకులు చింత సంతోష్ తదితరులు పాల్గొన్నారు.