calender_icon.png 4 October, 2024 | 7:02 AM

రైతులకు అండగా.. లాభాలు మెండుగా!

03-10-2024 01:19:18 AM

రైతన్న సేవలో వెల్దుర్తి పీఏసీఎస్

రూ.2 కోట్ల లాభాలతో ముందడుగు

వెల్దుర్తి, అక్టోబర్ 2 : చిన్న, సన్నకారు రైతులు తమ పొలాలకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. రైతు లు ఆర్థికంగా ఎదగడానికి సహకార సంఘాలపైనే ఆధారపడతారు.

వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మెదక్ జిల్లాలో వెల్దుర్తి పీఏసీఎస్ దినదినాభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తోంది. రూ.3.60 కోట్ల నష్టాల స్థాయి నుంచి రూ.2 కోట్లకు పైగా లాభాలకు ఎదిగింది. వెల్దుర్తి పీఏసీఎస్ 2005లో ఏర్పడింది. మొదట ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని ఏడు సంఘాలను కలుపుతూ ఉమ్మడి సంఘంగా ఏర్పడింది.

ఇందులో వెల్దుర్తి, ఉప్పులింగాపూర్, రామాయపల్లి, మంగళపర్తి, కుకునూర్, దామరంచ, మాసాయిపేట ఉన్నాయి. సం ఘం ఏర్పడిన సమయంలో రూ.3.60 కోట్ల నష్టంలో ఉంది. చైర్మన్‌గా అనంతరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంఘం రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం వెల్దుర్తి పీఏసీఎస్‌లో 4,094 మంది సభ్యులుగా ఉన్నారు. 

నష్టాల నుంచి లాభాల బాట

వెల్దుర్తి పీఏసీఎస్ నష్టాల ఊబి నుంచి బయటపడి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్నది. కోట్లాది రూపాయల ఆస్తులతోపాటు ఆర్థికంగా బలమైన సంఘంగా రూపాంతరం చెందింది. వెల్దుర్తి ప్రధాన రహదారిలో మూడెకరాలు కొనుగో లు చేసింది. వెల్దుర్తిలో 13 దుకాణ సముదాయాలను, మాసాయిపేటలో మూడు, బం డపోసాన్‌పల్లిలో రెండు దుకాణాలతోపాటు సంఘానికి సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకుంది.

౭ గోదాంలు, 80 మెట్రిక్ టన్నుల ధర్మకాంట ఏర్పాటు చేయడమే కాకుండా వెల్దుర్తి మండల డీసీసీబీకి ఏడు గుంటల భూమిని కేటాయించింది. వీటితోపాటు వెల్దుర్తిలో 500 మెట్రిక్ టన్నుల గోదాం, బండపోసాన్‌పల్లిలో 200 మెట్రిక్ టన్నులు, శెట్టిపల్లి కళాన్‌లో 1500 మెట్రిక్ టన్నులు, మంగళపర్తిలో 200 మెట్రిక్ టన్నులు, కుకునూర్‌లో 250 మెట్రిక్ టన్నులు, దామరంచలో 200 మెట్రిక్ టన్నులు, మాసాయిపేటలో 500 మెట్రిక్ టన్నుల గోదాంలను ఏర్పాటుచేసింది.

కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తాం

వెల్దుర్తి పీఏసీఎస్‌ను అన్ని సంఘాలకంటే బలోపేతం చేయడమే మా లక్ష్యం. ఇందుకోసం రానున్న రోజుల్లో మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తాం. మా సంస్థ ఆస్తి సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుంది. 2005 నుంచి ఇప్పటివరకు అందరి సహకారాలతో సంస్థను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం.

 పీఏసీఎస్ చైర్మన్, వెల్దుర్తి