calender_icon.png 24 November, 2024 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాడార్ నిర్మాణంతో మూసీకి ప్రమాదమే!

15-10-2024 03:32:09 AM

జనావాసాలు లేని ద్వీపాల్లో వాటిని ఏర్పాటు చేయాలి  

రాష్ట్ర ప్రయోజనాలను సీఎం రేవంత్ తాకట్టు పెట్టారు 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరుతో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే మూసీని ప్రమాదంలో పడేసే రాడార్ నిర్మాణానికి అంగీకారం తెలపడం ఆశ్చర్యంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు.

వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇదెక్కడి ద్వంద్వ వైఖరని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఏం ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయడాన్ని కేటీఆర్ వ్యతిరేకించారు. దామగుండంలో రాడార్ ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దాదాపు 2,900 ఎకరాల అటవీ భూభాగంతోపాటు 12 లక్షల చెట్లను నరికి వేసి నిర్మాణం చేపట్టడం విరమించుకోవాలని కోరారు.

జనవాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని ఎందుకు తెలంగాణలో నిర్మిస్తున్నారో చెప్పాలని అడిగారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల సమయంలో ఎంత ఒత్తిడి తెచ్చినా తమ ప్రభుత్వం అంగీకారం తెలపలేదని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 2900 ఎకరాల అటవీ భూభాగాన్ని నాశనం చేసేలా చర్యలు చేపట్టడాన్ని తప్పు పట్టారు.

గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించిందని, గంగోత్రికి ఒక న్యాయం తెలంగాణ మూసీ నదికి మరో న్యాయమా? అని మండిపడ్డారు. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రం వికారాబాద్ అడవుల్లోనే మూసీ జన్మస్థానంలోనే ఉందని, నది పుట్టిన ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మూసీ నది పురుడు పోసుకున్న చోట 12 లక్షల చెట్ల నరికివేతతో కోలుకోలేని అనర్థం జరుగుతుందని, పర్యావరణ సమతుల్యతకు పెను ప్రమాదాన్ని సృష్టించే ఈ ప్రాజెక్ట్ ను విరమించుకోవాలని సూచించారు. మూసీ నదిని ఫణంగా పెట్టేందుకు సహకరిస్తూ మరో వైపు మూసీ పరిరక్షణ అంటూ ముఖ్యమంత్రి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలతో కలిసి బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.

పేద వైద్య విద్యార్థినికి సాయం చేసిన ఎన్నారైకి కేటీఆర్ ప్రశంస 

పేద విద్యార్ధిని వైద్య విద్య కోసం తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఎన్నారై దూడల వెంకట్‌ను కేటీఆర్ అభినందించారు. సోమవారం ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ మొదటి ఏడాది ఫీజుకు సంబంధించిన చెక్కును కేటీఆర్ అందజేశారు.

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని కల్వరాలకు చెందిన బి గౌరీకి మెడిసిన్‌లో సీటు వచ్చింది. నిరుపేద కుటుంబం కావటంతో చదువు కోసం ఫీజు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. 

తక్షణమే స్పందించిన కేటీఆర్.. గౌరీ చదువు పూర్తయ్యే వరకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేటీఆర్ స్ఫూర్తితో ఆ పేద విద్యార్థిని చదువుకు తనవంతు సాయం అందించేందుకు అమెరికాలో నివసిస్తున్న వెంకట్ ముందుకొచ్చారు. తన జన్మదినం సందర్భంగా మొదటి సంవత్సరం ఫీజును తాను అందిస్తానని కేటీఆర్‌కు మాట ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం వెంకట్ తన కుటుంబ సభ్యుల ద్వారా నందినగర్‌లో కేటీఆర్ ఆధ్యర్యంలో గౌరి కుటుంబానికి రూ.1.65 లక్షల చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నారై వెంకట్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ అభినందించారు.

గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశానని గౌరీ చెప్పటంతో కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ చదువుకు అండగా నిలిచిన కేటీఆర్‌తోపాటు ఎన్నారై దూడల వెంకట్‌కు గౌరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రాహుల్‌వి మోసపూరిత హామీలు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీకి ఉత్తరాలు పంపిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా(కే) గ్రామస్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటన చేసి 300 రోజులైనా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మోసపూరిత హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు నిరసనలకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.