calender_icon.png 23 October, 2024 | 8:59 AM

శానిటరీ ప్యాడ్స్‌తో.. క్యాన్సర్ నిజమేనా!

17-06-2024 12:05:00 AM

పీరియడ్స్ ప్రతి ఆడపిల్లకు తప్పనిసరి విషయం. అయితే తరచు పీరియడ్స్‌కు సంబంధించిన కొన్ని సమస్యలు మహిళల్లో కనిపిస్తాయి. ఒక్కోసారి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి పీరియడ్స్ మిస్ కావడం, ఒక్కోసారి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపు కండరాల తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. పీరియడ్స్‌కు సంబంధించిన ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు.. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. అసలు పీరియడ్స్ సమయంలో ఎలాంటి శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించాలి.. ఎన్ని గంటలు వాటిని వాడాలి.. వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేంటి.. నిజంగా శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుందా..? రాదా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..!

మార్కెట్లో లభించే అన్ని రకాల శానిటరీ ప్యాడ్ల తయారీలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు (వొలాటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ వంటి విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. ఫ్లెక్సిబిలిటీ, పారదర్శకత, ఎక్కువ కాలం మన్నిక కోసం థాలేట్స్‌ను కలుపుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) ప్రకారం.. థాలేట్స్ అనేది యుక్తవయస్సులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తుంది. క్యాన్సర్, సంతానోత్పత్తి లోపాలకు కారణం అవుతుంది. టెస్టిక్యులర్ డిస్జెనిసిన్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీని వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. శానిటరీ ప్యాడ్ల తయారీలో ఎక్కువ మొత్తంలో వాడుతున్న రసాయనాలు అండాశయ, రొమ్ము క్యాన్సర్లను మోసుకొస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఇవీ ఆరోగ్య సమస్యలు..

శానిటరీ ప్యాడ్స్‌లో సువాసన, మృదుత్వం కోసం యాడ్సోర్బెంట్‌లు, అథెస్సీవ్స్‌గా, బైండర్‌గా వీఓసీలను, పర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తుంటారు. అలాగే తాజాదనం అనుభూతిని సృష్టించేందుకు ఎక్కువ మొత్తంలో వీఓసీలను వాడతారు. వీఓసీలలో వాడే బెంజీన్ క్యాన్సర్ కారకంగా నిరూపితమైంది. 1,4-డయాక్సేన్ సంభావ్య కార్సినోజెన్, నాఫ్తలీన్ కార్సినోజెన్. శానిటరీ ప్యాడ్లలో కనిపించే వీఓసీల వల్ల కళ్లు, ముక్కు, గొంతుపై ఇరిటేషన్ వస్తుంది. వికారం, అలసట, సమన్వయం కోల్పోవడం, మైకం కమ్మడం వంటివి సంభవించవచ్చు. కాలేయం, మూత్రపిండాలు, కేంద్ర నాడీ వ్యవస్థకు హాని కలిగించవచ్చు. శానిటరీ ప్యాడ్స్‌తో పర్యావరణానికి కూడా హానికరమని అధ్యయనాల్లో తేలింది. వీటిని కాల్చివేయడం ద్వారా వీటిలో ఉండే రసాయనాలు గాలిలోకి విషపూరితమైన డయాక్సిన్, ప్యూరాన్లను విడుదల చేస్తాయి. 

ప్యాడ్స్‌లో బ్లీచ్ ఉంటుంది..

మీకు తెలుసా.. పీరియడ్స్ సమయంలో ఉపయోగించే ప్యాడ్స్‌ను ఎలా తయారు చేస్తారో? నిజానికి ప్యాడ్స్ ఎంత తెలుపు రంగులో అంత పరిశుభ్రంగా ఉన్నదని అందరు ఫీల్ అవుతుంటారు. నిజానికి ప్యాడ్స్‌లో ఉపయోగించే కాటన్ (పత్తి) తెలుపు రంగులో ఉండదు. అది లేత పసుపు రంగులో ఉంటుంది. ప్యాడ్స్‌లో ఉపయోగించే పత్తిని బ్లీచింగ్ చేయడం వల్ల తెలుపు రంగులో వస్తుంది. పత్తిని డయాక్సిన్ అనే ప్రమాదకరమైన రసాయనంతో బ్లీచ్ చేస్తారు. ఇది ప్రమాదకరమైన పర్యావర ణ కాలుష్య కారకం. చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల్లో డయాక్సిన్ అనే రసాయానాన్ని వాడుతున్నారు. ఈ రసాయనం ప్రభావం వల్ల చర్మం నల్లబడటం, రోగనిరోధక సమస్యలు, పెల్విక్ ఇన్‌ఫ్లామెంటరీ వ్యాధులు, హార్మోన్ల పని చేయకపోవడం, మధుమేహం, అండాశయ క్యాన్సర్,  కాలేయం పని చేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

ప్యాడ్స్ క్యాన్సర్‌కు కారణమవుతాయా!

ప్యాడ్స్ వల్లే క్యాన్సర్ వస్తోందని చెప్పలేం. అయితే గర్భాశయ క్యాన్సర్ రావటానికి ప్యాడ్స్ కూడా ఓ కారణం అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్యాడ్స్‌లో ఉండే కొన్ని రసాయనాలు నేరుగా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ప్రమాదం జరుగుతుంది. శరీరంలోనే సున్నిత భాగమైన యోని ప్రాంతం రసాయనాల ప్రభావానికి గురవుతుంది. మరో విషయం ఏమిటంటే.. మెరుగైన శోషణ కోసం ప్యాడ్స్‌లో ఉపయోగించే ఫైబర్ గర్భాశయ క్యాన్సర్‌కు కారణం కావొచ్చు. వీటికి బదులుగా స్వచ్చమైన కాటన్ ప్యాడ్స్‌ను ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఇలా వాడాలి..

పెరినియల్ ఇన్‌ఫెక్షన్ల అవకాశాలను తగ్గించుకోవడానికి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. పెరినియల్ పరిశుభ్రతను పాటించాలి. సువాసనలతో కూడిన ప్యాడ్‌లను వాడకుండా చూసుకోవాలి. రేపర్లపై కోట్ చేసే సేంద్రియ వంటి పదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దురద, ఎరుపు వంటి పెరినియల్ ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు వస్తే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. 

హాని కలిగించే పదార్థాలు..

డయాక్సిన్

డయాక్సిన్ అనేది శానిటరీ ప్యాడ్స్‌లను బ్లీచ్ చేయడానికి ఉపయోగించే రసాయనం. డయాక్సిన్ శరీరానికి చాలా హానికరం. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. 

పురుగులమందులు

 శానిటరీ ప్యాడ్స్ తయారీకి ఉపయోగించే పత్తిలో తరచుగా కొన్ని పురుగుల మందులు కూడా వాడతారు. వీటి సాగు సమయంలో రైతులు దానిపై పిచికారీ చేస్తారు. 

ఆర్టిఫిషియల్ పెర్ఫ్యూమ్స్‌లు

ఆర్టిఫిషియల్ పెర్ఫ్యూమ్‌లు 

సురక్షితం కాని రసాయనాలు.

క్లాత్ నాప్కిన్స్ వాడాలి!

శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదు. కానీ కొన్నిసార్లు ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మెన్ట్రువల్ కప్స్ వాడమని చెబుతున్నాం. కాని అది కూడా కరెక్టుగా వాడాలి. మెన్ట్రువల్ కప్స్ ఎక్కవ సమయం ఉపయోగించకూడదు. దీనివల్ల యోనిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో క్లాత్ నాప్కిన్స్ వస్తున్నాయి. ఈ క్లాత్ నాప్కిన్స్‌ను రెండు లేదా మూడుసార్లు వాడొచ్చు. పాతకాలంలో మెత్తటి చీరలను.. పంచలను ఉపయోగించేవాళ్లు. అవి కూడా ఎక్కువ కాలం ఉపయోగించకూడదు. ఎందుకంటే బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్స్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. శానిటరీ నాప్కిన్స్‌తో ఇంకో సమస్య ఏంటి అంటే.. ఇవి పర్యావరణానికి కూడా ప్రమాదం. వాటిని ఉపయోగించి బయటపడేయటం, కాల్చేయడం వంటివి చేస్తుంటారు.. ఇవి అంత ఈజీగా మట్టిలో కలిసిపోవు.. గాల్లోకి భయంకరమైన ఉద్గారాలను విడుదల చేస్తాయి. అందుకని వెనక్కి వెళ్లి.. క్లాత్ తో నాప్కిన్స్ చేస్తున్నారు. గూంజ్  అని ఒక ఎన్‌జీఓ కూడా ఉంది. వాళ్ళు క్లాత్ తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్‌ను అమ్ముతున్నారు. అవి బాగానే ఉన్నాయి. లేకుంటే మెన్ట్రువల్ కప్స్ వాడాలి. 

 డాక్టర్ బాలాంబ, 

ప్రముఖ గైనకాలజిస్టు, హైదరాబాద్