calender_icon.png 23 October, 2024 | 11:05 AM

పనీర్‌తో.. పసందుగా..!

17-06-2024 12:05:00 AM

పనీర్ అంటే ఇష్టపడని వారుండరు. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్‌ఇది. ఇందులో ఉండే ప్రొటీన్‌లు, క్యాలరీల కారణంగా తిన్న తర్వాత చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలాగే పనీర్‌తో చేసిన వంటకాలు బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులో గుండె సంబంధిత ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఉన్నాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అలాగే పీచు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశకు దగ్గరలో ఉన్న మహిళలకు చిరాకు, ఒత్తిడి రాకుండా చేస్తుంది. 

పనీర్‌తో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. పనీర్‌తో తయారు చేసే వంటకాలను మీరూ ఓసారి ట్రై చేసేయ్యండి.

పనీర్ పెప్పర్ ఫ్రై..

కావాల్సిన పదార్థాలు: పనీర్ 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు మూడు, పచ్చిమిర్చి నాలుగు, క్యాప్పికమ్ ఒకటి, నల్ల మిరియాలు ఒక చెంచా, జీలకర్ర సగం చెంచా, లవంగాలు రెండు, దాల్చిన చెక్క రెండు, దనియాలు సగం చెంచా, ఎండుమిరపకాయలు నాలుగు, రుచికి తగినంత ఉప్పు.

తయారీ విధానం: ముందుగా స్టౌ మీద పాత్రలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. చిన్న మంటలో రెండు నిమిషాలు వేయించి, తీసివేసి మరో పాత్రలో ఉంచి చల్లారనివ్వాలి. తర్వాత అదే పాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. క్యాప్సికమ్‌ను సన్నగా తరుగుకొని అందులో వేసుకోవాలి. సన్నటి మంట మీద ఉడికించాలి. మరోవైపు వేయించిన మసాలా దినుసులను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టౌ మీద ఒక పాత్రలో రుబ్బిన మసాలా దినుసులు వేసి కలపాలి. అందులో పనీర్ వేసి కలపాలి. పసుపు వేసుకొని రెండు నిమిషాలు వేయించాలి. అలా రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చిన రుచికరమైన పనీర్ పెప్పర్ ఫ్రై రెడీ.

పనీర్ కోకోనట్ మసాలా..

కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు రెండు కప్పులు, ఉల్లిపాయ ఒకటి, టమాటోలు రెండు, గరంమసాలా చెంచా, ఉప్పు తగినంత, వెన్న మూడు చెంచాలు, కసూరీమేథీ చెంచా, దనియాలు రెండు చెంచాలు, జీలకర్ర అర చెంచా, ఎండుమిర్చి నాలుగు, వెల్లుల్లి రెబ్బలు మూడు, అల్లం చిన్న ముక్క, ఉల్లిపాయ ఒకటి, తాజా కొబ్బరి తురుము పావు కప్పు.

తయారీ విధానం:  స్టౌ మీద పాత్ర పెట్టి.. దనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేయించుకుని తీసుకోవాలి. అదే పాత్రలో చెంచా వెన్న వేసి.. వెల్లుల్లి, అల్లం ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తరువాత ఈ పదార్థాలూ, ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులూ, కొద్దిగా ఉప్పు మిక్సీలో వేసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మసాలాలో పన్నీర్ ముక్కల్ని వేసి వాటికి ఈ మిశ్రమం పట్టేలా బాగా కలపాలి. అరగంట అయ్యాక స్టౌ 

మీద పాత్ర పెట్టి మిగిలిన వెన్న వేసి.. ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించుకుని తరువాత టమాటో ముక్కలు వేయాలి. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గాయనుకున్నాక 

గరంమసాలా, పనీర్ ముక్కలు, పావు కప్పు నీళ్లు, మరికొంచెం ఉప్పు వేసుకుని కలపాలి. అయిదు నిమిషాలయ్యాక కసూరీమేథీ వేసి దింపేస్తే చాలు.

పనీర్ పులావ్..

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా, యాలకులు ఐదు, ఉప్పు తగినంత, గరం మసాలా అర చెంచా, మిరియాలు అర చెంచా, పసుపు ఒక చెంచా, బిర్యానీ ఆకు ఒకటి, పనీర్ 150 గ్రాములు, దాల్చిన చెక్క ఒకటి, పాలు మూడు చెంచాలు, ఉల్లిపాయలు రెండు, నెయ్యి మూడు చెంచాలు, పెరుగు ఒక కప్పు, పుదీనా ఒక కట్ట, కారం ఒక చెంచా, జీడి పప్పులు గుప్పెడు.

తయారీ విధానం: పనీర్ పులావ్ చేసేందుకు నూనెలో దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తర్వాత అల్లం పేస్టును కూడా వేసి కలపాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, బియ్యం వేసి కలుపుతూ ఉండాలి. మంటను తగ్గించాలి. ఈ లోపు ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్‌ను మరొక పాత్రలో వేసి గోధుమ రంగులోకి మారేవరకు నెయ్యిలో వేయించుకోవాలి. ఆ వేయించిన పనీర్‌ను ఈ బియ్యంలో వెయ్యాలి. అన్నింటినీ కలుపుకోవాలి. యాలకుల పొడి, గరం మసాలా, కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నాలుగు కప్పుల నీళ్లను వేసి మూత పెట్టాలి. పైన పుదీనా, కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. దించేముందు కుంకుమ రేకుల నీటిని పైన వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. అంతే టేస్టీ పనీర్ పులావ్ రెడీ అయినట్టే.