calender_icon.png 16 January, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త హంగులతో.. హాయిగా!

11-01-2025 12:00:00 AM

నిత్యం బిజీ లైఫ్‌లో పడి ప్రశాంతతను కోల్పోతున్నారు చాలామంది. మనసు, మెదడు ప్రశాంతంగా లేకపోతే నిద్ర పట్టదు. ఒక దగ్గర కుదురుగా కూడా ఉండలేరు. అలాంటి వారు ప్రశాంతమైన జీవితం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. కాస్త రెగ్యులర్ లైఫ్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే.. ఆనందంగా జీవించొచ్చు. ఇంట్లోనే హాయిగా.. ఆనందంగా గడపవచ్చు. దానికోసం మార్కెట్‌లో సరికొత్త హంగులతో కొన్ని వస్తువులు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవి.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. 

ఆయుర్వేద పిల్లోస్

ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రశాంతంగా నిద్ర పట్టడం చాలా కష్టం. దాంతో పాటు ఒత్తిడి, అనారోగ్యం కారణమేదైనా కొందరికి ఓ పట్టాన నిద్రపట్టదు. అలాంటి వారిని నిద్రపుచ్చేందుకు వచ్చినవే హెర్బల్ పిల్లోస్. కవర్ మొదలుకుని లోపలి దిండువరకూ హెర్బల్ సుగుణాలతో నిండి ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు.

నిమ్మ, పసుపు, కలబంద, లవంగాలు, చందనం, పచ్చకర్పూరం వంటి పరిమళాలని వాడి ఈ పిల్లో కవర్లని తయారుచేస్తున్నారు. అలాగే లోపలి దిండుని అవిసె గింజలూ, లావెండర్ పూలూ, ఆవాలూ వంటివాటితో నింపుతున్నారు. వీటిలోని ఆయుర్వేద గుణాలూ, పరిమళాలూ మనసుని తేలిక పరిచి హాయిగా నిద్రపోయేలా చేస్తాయి.

హాల్లో పూజ గది..

పండుగలూ, వ్రతాలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో పూజ గదిలో కాకుండా అందరికి సౌకర్యంగా ఉంటుందని హాల్లో పూజలు చేసేందుకు ఇష్టపడతారు చాలామంది. అలాంటి వారికోసమే ఇప్పుడు విడిగా పూజ గదులు దొరుకుతున్నాయి. పూర్తిగా చెక్క, గాజుతో డిజైన్ చేసిన ఈ పూజ గదులు కావాల్సిన చోటుకి మార్చుకునేలా ఉంటాయి. చిన్న గుడిలా కనిపిస్తూ, దేవతామూర్తులను పెట్టేందుకు పీటలతో, నలుగురు కూర్చుని పూజ చేసేందుకు వీలుగా ఉండటం వీటి ప్రత్యేకత. 

సుగంధ పరిమళం!

చలికాలంలో గాలిలో తేమ ఉండదు. దాంతో చర్మం పొడిబారి పోతుంది. చర్మం పొడిబారకుండా.. సుగంధ పరిమళాలను వెదజల్లేదే హ్యుమిడిఫయర్. ఇది చూడటానికి కూజాలా అందంగా కనిపిస్తుంది. పడుకునేటప్పుడు రెండు చుక్కల ఆరోమా నూనె వేసి ఆన్‌చేసి పెట్టుకుంటే ఒత్తిడి తగ్గించి, రిలాక్స్ అయ్యేందుకు హాయి గొలిపే పరిమళాలను విడుదల చేస్తుంది. చెక్కతో చేసిన ఈ ఫ్లవర్ ఉడ్ హ్యుమిడిఫయర్‌కి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఎనిమిది గంటలపాటు పనిచేస్తుంది.