calender_icon.png 22 October, 2024 | 5:14 AM

కొంగొత్త ఆశలతో..

22-10-2024 12:14:49 AM

  1. జిల్లాలో కొలువుదీరిన 334 ఉపాధ్యాయులు 
  2. నూతన ఉత్సాహంతో విద్యార్థులకు పాఠాలు

రంగారెడ్డి, ఆక్టోబర్21(విజయక్రాంతి): ఉపాధ్యాయ కొలువు దక్కించుకొనేందుకు ఆహోరాత్రులు శ్రమించిన నిరుద్యోగుల కలలు ఎట్టకేలకు తీరాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలో ముందు  ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను భర్తీచేసింది.

ఈఏడాది జూలై 19న విద్యాశాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 30న ఫలితాలను ప్రకటించింది. ఆయా పోస్టులకు ఎంపి కైన అభ్యర్థులకు అక్టోబర్ 9న దసరా పండుగ కానుకగా ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి  చేతులమీదుగా నియామకపత్రాలను అందజేశారు.

అనంతరం రంగా రెడ్డి జిల్లాకు సంబంధించి ఎంపికైన వారికి జిల్లా కేంద్రంలో డీఈఓ సుశీందర్‌రావు ఆధ్వర్యంలో అక్టోబర్ 15న కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపికైన వారికి  నియామక ఉత్తర్వులను విద్యాశాఖ అధికారులు అందజేశారు. 16న కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో ఖాళీల కనుగణుంగా వివరాలను సేకరించి మెరిట్ ప్రకారం వారికి గ్రామా లు, మండల కేంద్రాలవారీగా పోస్టులను కేటాయించారు.

ఆయా పోస్టులను దక్కించుకున్న వారంతా కొంగొత్త ఆశలతో తమకు కేటాయించిన పాఠశాలలో సంబురంగా అడుగు పెట్టారు. జిల్లాలో మొత్తం 334 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. అందులో ఎస్జీటీ 205 పోస్టులు కాగా మిగతావి స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.

నూతన ఉత్సాహంతో భోధన..

జిల్లాలోని 27 మండలాల్లో ఉపాధ్యాయ పోస్టులను దక్కించుకున్న వారంతా నూతన ఉత్సాహంతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో నూతన ఉపాధ్యాయుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. నూతన ఉపాధ్యాయులు.. ఇదివరకే ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలివిడిగా కలిసిపోతూ పాఠాలు చెబుతూ బిజీగా మారారు.

ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఆరాధించి ఈ వృత్తిలోకి వచ్చామని రాత్రి పగలు కష్టపడి ఉద్యోగం సంపాదించామని వారు తమ అనుభవాలను పంచుకున్నారు. కాగా చాలామందికి సొంత మండలాల్లోనే పోస్టింగ్ దక్కింది.

అమ్మానాన్న కూలీపని చేసి చదివించారు

చిన్నప్పటినుంచి ఉపాధ్యాయుడిని కావాలని కలలు కన్నాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం అహోరాత్రులు కష్టప డి చదివాను. అమ్మ, నాన్న అంతా కూలీ పనిచేసుకొంటూ నన్ను చదివిం చారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల ల్లోనే చదువు పూర్తిచేశాను.

ఆరునెలలు శ్రమించి ఎస్జీటీ ఉద్యోగం సాధించాను. ఉపాధ్యాయుడిగా తొలిరోజు ఉత్తర్వు లు అందుకు న్నప్పడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తలకొండపల్లి మండలం అంతారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. 

 జంతుక యాదయ్య, 

ఎస్జీటీ, ఆమనగల్లు