స్వదేశంలో మేము పులులం.. అంటూ విర్రవీగిన భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఏరి కోరి స్పిన్ ట్రాక్‌లు సెట్ చేసుకున్నా కానీ ఆ స్పిన్ వలలో పడి మనోళ్లు గిలగిలా కొట్టుకున్నారు. బంగ్లా మీద కేవలం ఆరు సెషన్లలోనే విజయం సాధించిన రోహిత్ సేనకు ఈ ఓటమి ఊహించనిది. ప్రతిష్టాత్మక బోర్డర్ ట్రోఫీకి ముందు ఇది పెద్ద దెబ్బే..
విజయక్రాంతి ఖేల్ విభాగం: పసికూనలను హడలెత్తించి మా అంతటి వీరులే లేరని విర్రవీగుతున్న భారత్‌కు కివీస్ గట్టి షాక్ ఇచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. గడిచిన పుష్కర కాలంగా భారత్‌కు స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమే లేదని జబ్బలు చరుచుకుంటున్న వేళ.. తొలి సారి సిరీస్ గెలవడమే కాదు. 24 ఏళ్ల తర్వాత వైట్ వాష్‌ను కూడా రుచి చూపించింది. కివీస్ కొట్టిన ఈ దెబ్బతో మనోళ్లకు ఒక్కసారి కళ్లు తిరిగి ఉంటాయి.
డబ్ల్యుటీసీ ఫైనల్ అనుమానమే..
ఇది వరకే రెండు సార్లు డబ్ల్యుటీసీ ఫైనల్‌కు చేరుకున్న రోహిత్ సేన ఈ సారి కూడా ఆ ఫీట్ సాధిస్తుందని నిన్న మొన్నటి వరకు అంతా విశ్వసించారు. కానీ కివీస్ చేతిలో భారత్ 3-0 తేడాతో ఓడిపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు భారత్ డబ్ల్యుటీసీ ఫైనల్ చేరడమంటే అంత సులువైన విషయం కాదు.
కంగారు పెడుతున్న కోహ్లీ..
రన్ మెషీన్‌గా పేరు గాంచిన విరాట్ కోహ్లీ గత కొద్ది రోజుల నుంచి కంగారు పెడుతూ వస్తున్నాడు. అభిమానులు ముద్దుగా కింగ్ అని పిలుచుకునే కోహ్లీ బ్యాటు నుంచి మూడంకెల స్కోరు చూసి రెండేళ్లు కావస్తోంది. కోహ్లీతో పాటు హిట్ మ్యాన్ శర్మ కూడా వరుసగా విఫలమవడం కొత్త కంగారుకు కారణమవుతోంది.
ఆసీస్ టూరే ఆఖరా?
కోహ్లీ, రోహిత్‌లకు ఆసీస్ టూరే ఆఖ రు అని కామెంట్లు వినవస్తున్నాయి. విఫలమవుతూ వస్తు న్న కోహ్లీ, రోహిత్ జట్టు నుంచి గౌరవంగా తప్పుకోవాలనే డి మాండ్లు వినవస్తున్నాయి.
తొలి ర్యాంకు ఢమాల్
మూడో టెస్టులో కూడా ఓడిపోవడంతో డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. మొదటి రెండు టెస్టులు ఓడినా కానీ తొలి స్థానంలోనే కొనసాగిన రోహిత్ సేన మూడో టెస్టు ఓటమి తర్వాత మాత్రం కిందకు జారింది. 58.33 సగటుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ జట్టు 62.50 సగటుతో తొలి స్థానంలో ఉంది.
ఆ దిగ్గజాల లోటు తీర్చేదెవరు!
చటేశ్వర్ పుజారా, అజింక్య రహనే ఈ ఇద్దరి ఆటను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. వారి షాట్లలోని క్లాస్, మాస్, వారికుండే ఓపిక అన్నీ వేరే లెవల్. ఇప్పుడు జట్టు ప్రతిష్టాత్మక బోర్డర్ ట్రోఫీ కోసం ఆసీస్ పర్యటనకు వెళ్తోంది. అటువంటి తరుణంలో ఈ దిగ్గజాలు లేకపోవడం పెద్ద లోటే. సొంత దేశంలో కివీస్ చేతిలో 3 తేడాతో వైట్ వాష్‌కు గురైన తర్వాత అందరికీ వారి విలువ తెలిసొచ్చింది.