calender_icon.png 26 December, 2024 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గారడీ మాటలతో.. మోసం చేశారు!

05-12-2024 12:00:00 AM

తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా ముందు వరుసలో నిలబడి ఉద్యమంలో పాల్గొన్నా.. 20౧౨ నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రత్యేక రాష్ట్రం వస్తే.. మన ఉద్యోగాలు మనకే వస్తాయి.. మన పిల్లల భవిష్యత్ బాగుపడుతుందని.. కుటుంబ పరిస్థితులను సైతం పక్కన పెట్టి.. ఉన్న ఆస్తులను అమ్మి ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను.. జైలు జీవితం.. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన మలిదశ ఉద్యమకారుడు లక్ష్మా గౌడ్.  

కేసీఆర్ కామారెడ్డికి వచ్చినప్పుడు బహిరంగ సభలో చెప్పిన ప్రసంగం నాలో బలంగా పాతుకుపోయింది. ఉద్యమం కోసం ఉన్న ఆస్తులను అమ్మివేసి చురుకుగా పాల్గొన్నా. కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు, ప్రతి కార్యక్రమానికి ముందుండి కుటుంబ పరిస్థితులను లెక్కచేయకుండా 2021 నుంచి ఉద్యమంలో పాల్గొన్నా. కామారెడ్డిలో కేసిఆర్ చేపట్టిన ‘ధూం ధాం’ కార్యక్రమంతో పాటు సైకిల్ ర్యాలీలు, రోడ్ల దిగ్బంధం, రైలురోకో, బస్సురోకోలో పాల్గొన్నా.

తెలంగాణ రాష్ట్రం సాధించుకుందానే తపనతో ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని కేసుల పాలు కావడమే కాకుండా రైల్‌రోకోలో నాలుగు సంవత్సరాల పాటు  సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు హజరై ఎన్నో డబ్బులు ఖర్చుపెట్టుకున్నా. అప్పటి మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో పాటు కామారెడ్డికి చెందిన నాయకులు ప్రభాకర్‌రెడ్డి, భూంరెడ్డితో పాటు 15మందిపై రైలురోకో నిర్వహించినందుకుగాను కేసులు అయ్యాయి. చివరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రైల్వే పోలీసులు జరిమానా విధించి కేసును కొట్టివేశారు. 

ఏ ఉద్యమానికి పిలుపునిచ్చిన మమ్మల్ని ముందుగానే పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించేవారు. వందలాది కేసులు నమోదైన లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమమే ఊపిరి అని భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందనే తాపత్రాయంతో మలిదశ ఉద్యమంలో కేసిఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచి కేసుల పాలు కావడమే కాకుండా ఉన్న ఆస్తులు తరిగిపోయాయి. ప్రస్తుతం ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు.

పోలీస్ దెబ్బలు, లాఠీ చార్జీలు, కేసులు మాత్రమే మిగిలాయి. ఎన్నో ఇబ్బందులు.. ఎన్నో అడ్డంకులు.. ఎదుర్కొని ఉద్యమంలో పాల్గొని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకున్నా.. అప్పటి ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, సురేందర్‌లు నమ్మక ద్రోహం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని చివరి నిమిషంలో మోసం చేశారు. నా భార్యను, ఇద్దరు చిన్న కూతుర్లను, వదిలిపెట్టి ఉద్యమంలో రాత్రింబవళ్లు పనిచేస్తే ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు.

గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తే కేసీఆర్, హరీష్‌రావులు గ్రామానికి వచ్చారు. గ్రామ జేఏసీ అధ్యక్షునిగా, గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన పట్టించుకోలేదు. సుమారు కోటి రూపాయల ఆస్తులు నష్టపోయా. ఉన్న ప్లాట్లను అమ్ముకొని అప్పుల పాలయ్యా. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అదుకుంటుందని చెప్పి పదేళ్ల టీఆర్‌ఎస్ పరిపాలనలో ఒక్క సహయం కూడా చేయలేదు. దీంతో అప్పుల పాలుతో కుటుంబం రోడ్డు పాలైంది. 

 మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి, విజయక్రాంతి


మోసపూరిత ప్రభుత్వం.. 

ఉద్యమంలో పాల్గొన్నందుకు నాకు ఏ పదువులు రాలేదు. నేనే కాదు తెలంగాణ యువతను కూడా మోసం చేసింది ప్రభుత్వం. దీంతో టీఆర్‌ఎస్ పార్టీని విడిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరాను. ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు నాకు భరోసానిచ్చారు. ఒక వైపు అనారోగ్యంతో, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం కొట్టుమిట్టాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయిన నాలాంటి ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులను అందుకుంటే బాగుంటుంది. 

- ఉద్యమకారుడు లక్ష్మా గౌడ్