calender_icon.png 30 April, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకేపీతో రైతులు బిచ్చగాళ్ళ బతుకులాయే

30-04-2025 12:47:31 AM

అధికారులు పట్టించుకోరాయే.. మిల్లర్లు రారాయే..!

కల్లూరు ఏప్రిల్ 29(విజయ క్రాంతి) అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా పక్కనే మిల్లర్లు, గ్రామంలో ఐకెపి సెంటర్, సొసైటీ ఉన్నప్పటికీ రైతుల ధాన్యం కొనేవాళ్లు లేక నెల దాటినా యార్డులోనే మూలుగుతూ ఎప్పుడు కొంటారోనని ఎదురుచూపులు చూస్తూ దీనస్థితిలో రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి మండల పరిధిలోని కొర్లగూడెం రైతులది.అష్ట కష్టాలు పడి పంట పండించి అమ్ముకోవాల్సి వచ్చేసరికి రైతులకు చుక్కలు చూపిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

గ్రామంలో ఐ కె పి సెంటర్ నందు ధాన్యం ఆరబోసి నెల దాటిన కొనుగోలు చేయడం లేదని అన్నారు. కొంతమందివి కాంటా వేసినప్పటికీ ఇంకా కల్లాలోనే ఉన్నాయని తెలిపారు. మా పరిస్థితి ఏంటని నిలదీస్తే లారీ మీరే తెచ్చుకోండి మిల్లర్లతో మీరే మాట్లాడుకోండని అప్పుడు కొంటామని సమాధానం ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ధాన్యం కొంటామని ఒప్పుకొని పక్క జిల్లాలోని ధాన్యాన్ని కొంటున్నారు కానీ కొర్లగూడెం రైతుల ధాన్యం కొనట్లేదని బాధ వ్యక్తపరుస్తున్నారు.

అధికారులు సైతం కొనుగోల కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదని తెలిపారు. అధికారుల కోసం, మిల్లర్లు చుట్టూ తిరుగుతూ, ఐకెపి నిర్వాహకులను బ్రతిమలాడుతూ చివరికి రైతులది బిచ్చగాళ్ళ బ్రతుకులైనాయాయని అంటున్నారు. ప్రస్తుతం వాతావరణం ఎప్పుడు ఎట్లా మారుతుందో.. అర్థం కాక బిక్కు బిక్కుమంటూ కల్లాల చుట్టూ ప్రదక్షణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

పంట వేసిన దగ్గర నుంచి చేతికి వచ్చి విక్రయించే వరకు అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదని.దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరిగిందంటే.. కాంటాలు వేయడం, వాటిని మిల్లుకు తరలించడం మరో ప్రయాసగా మారింది. మిల్లర్లు దాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో   అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.వాతావరణం మారి వర్షాలు వస్తుండటంతో ధాన్యాన్ని రక్షించుకోవుడు తలకుమించిన భారంగా మారింది.

ఏమీ చేయాలో పాలుపోక స్థానికంగా అమ్ము కుందామంటే సరైన గిట్టుబాటు ధరలేక ఆయోమయంలో ఉన్నామని తెలిపారు. కాంటా వేసి కల్లంలో ఉన్న ధాన్యం సమయానికి లారీలు దొరకడం లేదని చెప్పి మిల్లర్లు దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తుండటంతో మరో వైపు ఆకాల వర్షాలు వస్తుంచటంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నామని అన్నారు.

కొర్లగుడెం లో యాభై వేల పైబడి దాన్యం బస్తాలు ఉన్నదని ఆకాల వర్షాలతో ధాన్యాన్ని తడవకుండా కాపాడటం  పరదాలు, కూలీలు, ఇతర ఖర్చులు పెరిగి అన్న దాతలపై అదనపు భారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే రైతులను ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు.