18-02-2025 01:35:33 AM
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కల్యాణం దేవతామూర్తుల కల్యాణంతో ముగిసిన జాతర
పెన్ పహాడ్, ఫిబ్రవరీ 17 : మండల పరిధిలోని చీదెళ్ళ గామములో ఈనెల 12 నుంచి నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర ఉత్సవాలు సోమవారం దేవతామూర్తుల కళ్యాణంతో ముగిసింది. చివరిరోజు అయినప్పటికి జాతర ప్రాంగణం భక్తలతో కిటకిటలాడింది.
ఉదయాన్నే అమ్మవారికి సుప్రభాతసేవ, మహావిద్యా పరాయణం, ఛండీ సప్తపతీ పరాయణం, 108 రకాల కలవ పూలతో అర్చన, 108 రకాల పండ్లతో అర్చన, శాతంబరీ అలంకరణ, కళ్యాణ ఉత్సవాలు, మహానివేదన, తీర్ధ ప్రసాద వితరణ తదితర ప్రత్యేక పూజలను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ముక్కోటి దేవతల సాక్షిగా అమ్మవారి కళ్యాణం వేలాది మంది భక్తజన సందోహం నడుమ, వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళవాయిద్యాల నడుమ దేవాలయ ప్రాంగణంలో దేవతామూర్తుల కళ్యాణ తంతు కనుల పండువగా జరిగింది.
తర్వాత లోక కళ్యాణార్ధం కోసం గోపయ్య సమేత శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం, మహాపూర్ణవతి, అవబృదస్నానం, నీరాజనం, మంత్రపుష్పం, తీర్ధ ప్రసాద వితరణ, కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు.
ముందుగా సాంప్రదాయ బద్దంగా స్వామీవారులకు ఆలయ కమిటి చైర్మన్ మోదుగు నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి, జూలకంటి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు అందజేసి కళ్యాణ తంతు నిర్వహించారు.
స్వామీ వారుల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిపించారు. అమ్మవారి వివాహన్ని తిలకలించడానికి చీదెళ్ళ, తంగెళ్ళగూడెం, చెట్లముకుందాపురం గ్రామ భక్తులే కాక మునగాల మండల భక్తులు వేలాదిగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉత్సవాలు భక్తులకు ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.