calender_icon.png 17 October, 2024 | 2:45 PM

దీపావళితో.. ఉపాధి!

17-10-2024 12:00:00 AM

దేశంలో పండుగ వాతావరణం నడుస్తోంది. దసరా నవరాత్రులు ముగిశాయి. వెంటనే దీపావళి సీజన్ మొదలైంది. ఈ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు సైతం మొదలుపెడుతున్నారు కొందరు. సాధారణంగానే దీపావళి అనే ది వ్యాపారాలకు గొప్ప సమయం. ఈ నేపథ్యంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి అవకాశం.

అయితే దీపావళికి కొన్ని రకాల వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే.. అందుకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటో చూసేయండి..

ప్రమిదలు..

దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఆరోజు అందరూ పటాసులు పేలుస్తారో లేదో చెప్పలేం కానీ, తమ గుమ్మం ముందు అయితే కచ్చితంగా దీపాలు పెడతారు. చాలామంది ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అందుకే సహజ పదార్థాలతో, చేతితో తయారు చేసిన ప్రమిదలను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఈ సీజన్‌లో చేతితో చేసిన ప్రమిదల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. 

పటాసులు..

దీపావళి సీజన్‌లో పటాసులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దీనికోసం మనం కొంత పెట్టుబడి పెట్టగలిగితే.. కొద్ది రోజుల్లోనే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది పటాసులు అమ్ముతారు కాబట్టి వ్యాపారంలో పోటీ ఎక్కువగానే ఉంటుంది. అలాగే పటాసులు విక్రయించడానికి ముందుగానే లైసెన్స్ తీసుకో వాలి. పేలిపోయే వస్తువులు కాబట్టి ఎలాంటి అగ్ని ప్రమా దం జరగకుండా వాటిని జాగ్రత్తగా నిల్వ చేయాలి. 

స్నాక్స్ అమ్మకాలు..

నేటి బిజీ లైఫ్‌స్టుల్‌లో, దీపావళి పర్వదినాన స్నాక్స్‌ను తయారు చేసుకోవడానికి కొందరికి టైమ్ ఉండట్లేదు. అందుకే రెడీమేడ్ స్నాక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. స్వీట్‌హోమ్స్‌లో రెగ్యులర్‌గా లభించే స్వీట్స్ కాకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే స్వీట్స్ కొన్ని ఉంటాయి. వీటి రుచి కూడా చాలా బాగుంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. వాటిని తయారు చేసి విక్రయించవచ్చు. అలాగే డ్రైఫ్రూట్స్, పేనీలు, మరమరాలకు కూడా ఈ సీజన్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని కూడా విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయి. 

క్యాండిల్స్ తయారీ..

తక్కువ పెట్టుబడితో క్యాండిల్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటికోసం మైనం, దారం, రంగుతో పాటు ఈథర్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. సువాసన కోసం అవసరమైన ఆయిల్‌ను కూడా వాడొచ్చు. ఇక క్యాండిల్స్‌ని తయారు చేసే ఆటోమేటిక్ మెషీన్‌లు కూడా లభిస్తున్నాయి. ఈ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ కూడా అందిస్తోంది. క్యాండిల్స్ బిజినెస్‌కి దీపావళి సీజన్‌లోనే కాకుండా.. ఆ తర్వాత కూడా మంచి డిమాండ్ ఉంటుంది. క్రిస్మస్ టైమ్‌లోనూ కొవ్వొత్తుల విక్రయాలు భారీగా సాగుతుంటాయి. 

లైట్ల అమ్మకం.. 

ఏ పండగ వచ్చినా, ఇంట్లో శుభకార్యం ఉన్నా.. తమ భవనాలను మిరుమిట్లుగొలిపే లైట్లతో అలంకరించు కోవడం ట్రెండ్ అయిపోయింది. ఈ లైట్ల వల్ల ఇళ్లు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటిని హోల్‌సేల్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి, అవసరమైనవారికి రిటైల్‌గా విక్రయించవచ్చు. అద్దెకు కూడా ఇవ్వొచ్చు. దీంతో మంచి లాభాలు వస్తాయి. 

పూజా సామగ్రి.. 

సర్వ సంపదలు లభిస్తాయనే నమ్మకంతో చాలామంది దీపావళి పర్వదినాన లక్ష్మీ పూజ లు నిర్వహిస్తారు. అందుకే పూజా సామగ్రికి సంబంధించి వ్యాపారం కూడా మొదలు పెట్టవచ్చు. పూజా సామగ్రిపై లాభం ఎక్కువగా వస్తుంది. వివిధ రకాల వస్తువులు, అలంకరణ సామగ్రి మీ దగ్గర ఉంటే మంచి లాభాలు పొందవచ్చు.