calender_icon.png 21 January, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబోస్‌తో చల్లగరిగెకు ప్రపంచ గుర్తింపు

05-07-2024 12:22:06 AM

  • సొంత ఖర్చులతో గ్రంథాలయం అభినందనీయం 
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్ భూపాలపల్లి, జూలై 4 (విజయక్రాంతి): మారుమూల గ్రామమైన చల్లగరిగను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కొనియాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో ఆస్కార్ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత చంద్రబోస్ రూ.36 లక్షల సొంత ఖర్చులతో నిర్మించిన గ్రంథాలయాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చల్లగరిగలో జన్మించి, సినీ గేయ రచయితగా అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబోస్ స్వగ్రామంలో గ్రంథాలయం నిర్మించి అభివృద్ది, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయమని అన్నారు. 

ఆస్కార్‌కు గుర్తుగా గ్రంథాలయ నిర్మాణం : చంద్రబోస్

ఆస్కార్ అవార్డుకు తీపి గుర్తుగా స్వగ్రామంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు ప్రముఖ సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం లో చంద్రబోస్ మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంలో గ్రామానికి ఏదైనా మంచిచేయాలని ఆలోచిస్తున్న తరుణంలో తన సతీమణి సుచిత్ర శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని బాగు చేయాలని తన దృష్టికి తీసుకువచ్చిందని అన్నారు. గత ఏడాది జరిగిన సన్మాన కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు రూ.36 లక్షల వ్యయంతో నూతన గ్రంథాలయ భవనం నిర్మించామని తెలిపారు. పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

చంద్రబోస్ దంపతులకు సన్మానం 

గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా భవన నిర్మాణ దాత చంద్రబోస్ దంపతులను ఎమ్మెల్యే గండ్ర ఘనంగా సన్మానించారు. గ్రామంలో సొంత ఖర్చులతో గ్రంథాలయ భవనం నిర్మించి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పలువురు అధికారులు, పుర ప్రముఖులు, స్నేహితులు, అబిమానులు ఆయనకు మెమోంటోలతో ఘనంగా సత్కరించారు.